- ఓపెన్ కాస్ట్ భూనిర్వాసితులకు భరోసా కల్పించారు.
సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): అధైర్యపడొద్దు అండగా ఉంటామని బిఎస్పీ నాయకులు ఎం.వి.గుణ అన్నారు. ఆదివారం దుబ్బగూడెం భూనిర్వాసితుల కుటుంబాలను కలిసి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో కాసిపేట మండలం, దుబ్బగూడెం ప్రజలు తమ భూమి కోల్పోతున్నారని చెప్పారు. గ్రామంలో 203 ఇండ్లు ఉండగా, అధికారులు కలిసి ఇటీవల 80ఇండ్లకు తాత్కాలిక నిర్మాణం పనులు చేపట్టారని తెలిపారు. కొంతమంది దళారులు తప్పుడు సర్వే రిపోర్టులను అందించి, అసలు భూనిర్వాసితులకు నష్టం జరిగేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భూ నిర్వాసితులకు ఇచ్చిన నోటిసుల్లో మొదటి సారి నోటిస్ కి, రెండో నోటీసు కి ప్లింత్ ఏరియాకి, ఓపేన్ ఏరియాకి చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. అనేక మందికి భూవిస్తీర్ణం తక్కువగా చూపిస్తూ నష్టపరిహారం తక్కువ వచ్చేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.