Breaking News

డిజిటల్‌ ఇండియా

డిజిటల్‌ ఇండియా
  • టెక్నాలజీపై దేశవ్యాప్తంగా చైతన్యం
  • కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌
  • ఐటీఐఆర్‌ను కేటాయించండి: మంత్రి కేటీఆర్​
  • హెచ్‌ఐసీసీలో ఈ గవర్నెన్స్‌ సెమినార్​

సామాజికసారథి, హైదరాబాద్‌: టెక్నాలజీపై దేశవ్యాప్తంగా చైతన్యం కల్పిస్తున్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. అందుకోసం అన్ని రాష్ట్రాల్లోనూ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నామని, న్యూ ఇన్నోవేషన్‌, న్యూ టెక్నాలజీలో హైదరాబాద్‌ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కొవిడ్‌ పాండమిక్‌లో చాలా రంగాలు డిజిటలైజేషన్‌ మీదే ఆధారపడ్డాయని గుర్తుచేశారు. తద్వారా పనులు సులువు అయ్యాయని పేర్కొన్నారు. రెండేళ్లుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఎక్కువగా పనిచేస్తున్నారని, భారత్‌ను డిజిటల్‌ ఇండియాగా మార్చేందుకు ప్రధాని మోడీ కంకణం కట్టుకున్నారని కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగిన ఈ గవర్నెన్స్‌ జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. డిజిటల్‌ పేమెంట్స్‌ వల్ల టైమ్‌ ను ఆదా చేసుకోవచ్చన్నారు. స్పేస్‌ ఏక్సలెన్స్‌ సెంటర్‌ ను హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకుంటామని చెప్పారు. 

పరిశోధన ఫలాలను పంచుకుంటాం

ఈ గవర్నెన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఎలక్ట్రానిక్స్​సర్వీస్‌ డెలివరీలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని, టీ యాప్‌తో రోజుకు 270కు పైగా వివిధ ప్రభుత్వ సర్వీసులను అందజేస్తున్నామని చెప్పారు. ఫెస్ట్‌ యాప్‌ తో 17 సర్వీసెస్‌ రవాణా శాఖ ద్వారా అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఆయన డిజిటల్‌ లిటరసీ కోసం డిజిటల్‌ ఇన్ ఫ్రాస్టక్చర్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందుకోసం టీఫైబర్‌ ప్రాజెక్టు ద్వారా 30వేల ప్రభుత్వ కార్యాలయాలు, 80 లక్షల గృహాలకు ఇంటర్​నెట్‌ కనెక్టివిటీ కల్పించనున్నట్లు వెల్లడించారు. దేశంలోని పలు రాష్ట్రాలతో కలిసి తమ పరిశోధన ఫలాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఐటీఐఆర్‌ను కేంద్రం తెలంగాణకు గతంలో కేటాయించి వెనక్కి తీసుకున్నదని, దీనిపై పునరాలోచన చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్‌ తయారీ క్లస్టర్లకు అదనంగా మరో రెండు ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లను కేటాయించాలని, ఇన్‌ స్పేస్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ను కేటీఆర్‌ కోరారు. కార్యక్రమంలో ఐటీ కార్యదర్శి జయేశ్​రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.