Breaking News

​అందరి కృషితో అభివృద్ధి

అందరి కృషితో అభివృద్ధి
  • యువత కోసంకొత్త జాతీయ విద్యా విధానం
  • అగర్తలాలో ప్రధాని నరేంద్రమోడీ

అగర్తలా: భారత్​అందరి కృషితో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని కొన్ని రాష్ట్రాలు ప్రాథమిక సౌకర్యాల కోసం తహతహలాడుతున్నాయి, ఈ అసమతుల్య అభివృద్ధి మంచిది కాదన్నారు. మంగళవారం త్రిపురలోని అగర్తలాలో ఆయన పర్యటించారు. రూ.450 కోట్లతో నిర్మించిన మహారాజా బిర్‌ బిక్రమ్‌ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి యోజన, విద్యాజ్యోతి స్కూల్‌ ప్రాజెక్ట్‌ మిషన్‌ 100 కీలక కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. తల్లి త్రిపుర సుందరి ఆశీస్సులతో త్రిపురకు ఏడాది ప్రారంభంలో మూడు వరాలు లభిస్తున్నాయన్నారు. మొదటి బహుమతి కనెక్టివిటీ, రెండవ బహుమతి మిషన్‌ వంద విద్యాజ్యోతి స్కూళ్లు, మూడవ బహుమతి త్రిపుర గ్రామ సమృద్ధి యోజన పథకాలు అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక్కడ ప్రజలు దశాబ్దాలుగా ఇక్కడ చూస్తున్నది ఇదే. ఇంతకుముందు ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి త్రిపుర అభివృద్ధిపై దృక్పథం లేదన్నారు. నేడు త్రిపుర డైమండ్‌ మోడల్‌లో దాని కనెక్టివిటీని మెరుగు పరుచుకుంటుందన్నారు. 21వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆధునికంగా తీర్చి దిద్దుతున్న యువత కోసం దేశంలో కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రధాని చెప్పారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాన్ని దేశానికి అందించడంలో త్రిపుర కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ తయారయ్యే వెదురు చీపుర్లు, సీసాలు.. వంటి ఉత్పత్తులకు దేశంలోనే భారీ మార్కెట్‌ ఉందన్నారు. దీనివల్ల వేలాది మంది సహచరులు వెదురు వస్తువుల తయారీలో ఉపాధి, స్వయం ఉపాధి పొందుతున్నారని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు.