- 317జీవోను తక్షణమే రద్దుచేయాలి
- నిర్బంధ బదిలీలు మంచిది కాదు
- సర్వీస్ రూల్స్ వెంటనే మార్చండి
- బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్
- డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సామాజిక సారథి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుళ్లు జీవోనం.317తో స్వరాష్ట్రంలోనే తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, తక్షణమే ఆ జీవోను రద్దుచేయాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్కో ఆర్డినేటర్, రిటైర్డ్ఐపీఎస్ అధికారి డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉద్యోగుల విభజన, బదిలీలకు స్థానికతను పక్కన పెట్టి కేవలం సర్వీసు సీనియారిటీకి ప్రాధాన్యమివ్వడం సరికాదని ఆక్షేపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సిన ప్రమోషన్లు, బదిలీలు ఏడేళ్లుగా నిలిచిపోయాయని గుర్తుచేశారు. ఆగమేఘాల మీద ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తోందన్నారు. సీనియారిటీ ప్రాతిపదికన ఎక్కువ సీనియారిటీ ఉన్న ఉద్యోగులు అర్బన్ జిల్లాలకు, సిటీకి దగ్గరగా ఉండే ప్రాంతాలకు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చుకొని వెళ్లిపోయారని అన్నారు. కానీ లక్షలాది మంది జూనియర్ ఉద్యోగులు మాత్రం స్థానిక జిల్లాలోనే పుట్టి, పెరిగి, చదివి ఉద్యోగం చేస్తున్నా జూనియర్ కారణంతో ఇతర జిల్లాలకు నిర్బంధంగా బదిలీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ జిల్లాల్లో రిటైర్మెంట్ద్వారా ఖాళీలు తొందరగా ఏర్పడితే రూరల్ జిల్లాలో మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. లోకల్ పోస్టుల్లో నాన్ లోకల్ వాళ్లు వచ్చి చేరడంతో భవిష్యత్‌లో ఖాళీపోస్టులు ఏర్పడక, ఆయా జిల్లాల్లోని యువతకు భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు లభించే అవకాశం లేదన్నారు. అందుకే స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే స్పౌజ్, ఇతర ప్రత్యేక మినహాయింపులు కలిగిన ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని విభజన చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు అనుగుణంగా ఉద్యోగుల సర్వీస్ రూల్స్ వెంటనే మార్చాలని డిమాండ్‌చేశారు. తద్వారా మాత్రమే జూనియర్ ఉద్యోగులు ప్రమోషన్ పొందినప్పుడు సొంత జిల్లాలకు వెళ్లవచ్చని సూచించారు.