న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ విరుచుపడుతోంది. వైరస్ తన రూపాంతరాన్ని మార్చుకుంటోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. ఈ తరుణంలో థర్డ్‌వేవ్ ముప్పు కూడా తప్పదన్న సైంటిస్టులు, వైద్యనిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రతిఒక్కరిలోనూ మరింత భయాందోళన మొదలైంది. విపత్తు ఎలా విరుచుకుపడుతుందోనన్న కలవరం నెలకొంది. దేశంలో కొవిడ్ అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కొనేందుకు టీకాలపై పరిశోధనలను పెంచాలని కేంద్రప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు విజయరాఘవన్ సైతం హెచ్చరించారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ ను అప్ డేట్ చేయాలని, ప్రస్తుత వ్యాక్సిన్లు బాగానే పనిచేస్తున్నాయని సూచించారు.
ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్‌పై సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా ముప్పు పొంచి ఉన్నందున ఢిల్లీలో ఆక్సిజన్ కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇదిలాఉండగా, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4.13 లక్షల కేసులు నమోదుకాగా, నాలుగువేల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రెండు వారాల వ్యవధిలో 30 జిల్లాల్లో కొవిడ్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 7 జిల్లాలు ఉన్నట్టు తెలిపారు. అత్యధిక కేసులు పెరుగుతున్న 24 రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.