Breaking News

రగిలిన పోడు భూముల వివాదం

రగిలిన పోడు భూముల వివాదం
  • అధికారులపై పెట్రోల్ పోసిన మహిళారైతు
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం

సారథి, అచ్చంపేట: నాగర్​కర్నూల్​ జిల్లా నల్లమలలో పోడు భూముల వివాదం మరోసారి రగిలింది. అటవీశాఖ అధికారులు, ఆదివాసీ గిరిజనుల మధ్య అగ్గిరాజేసింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అమ్రాబాద్ మండలం మాచారంలో 20 ఆదివాసీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అదే గ్రామంలో సుమారు 60 ఎకరాల పోడు భూములను సాగుచేసుకుంటూ ఎన్నో ఏళ్లుగా జీవనోపాధి పొందుతున్నారు. ఈ తరుణంలో ఖరీఫ్, రబీ సీజన్ లో సాగుచేయొద్దని నెలరోజులుగా అటవీశాఖ అధికారులు ఆదివాసీ రైతులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి పోడు భూముల్లో బెస్​లైన్స్​వేసేందుకు అధికారులు రావడంతో సున్నం బ్యాగులను సాగుదారులు కొల్లగొట్టారు. ఎన్నో ఏళ్లుగా సాగుచేస్తున్న భూముల్లో ఎప్పుడు వ్యవసాయం వద్దనడం ఏమిటని అధికారులను నిలదీశారు. సుమారు గంటన్నర పాటు ఆదివాసీలు, ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది మధ్య మాటలయుద్ధం సాగింది. అధికారులు ఎంతకీ వెనక్కి వెళ్లకపోవడంతో తీవ్రఆవేదనకు గురైన ఓ మహిళా రైతు తన వెంట తెచ్చిన పెట్రోల్ ను వారిపై చల్లింది. అనంతరం నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా సదరు అధికారులు అడ్డుకున్నారు. భూముల కోసం తాము చావడానికైనా, చంపడానికైనా సిద్ధమేనని కొందరు ఆదివాసీ రైతులు భీష్మించడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎమ్మెల్యే రంగప్రవేశంతో మారిన సీన్​
విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​గువ్వల బాలరాజు కార్యకర్తల సాయంతో బైక్​పై అక్కడికి చేరుకున్నారు. తొలుత అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులకు మద్దతునిచ్చారు. అమ్రాబాద్ మండలంలో పలువురు రైతులు పోడు భూముల విషయాన్ని తన దృష్టికి తెచ్చారని ఆయన గుర్తుచేశారు. త్వరలో దీనిపై సీఎం కేసీఆర్ కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటారని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ విషయంలో అటవీశాఖ అధికారులు సంయమనం పాటించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్​లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు అవకాశం కల్పించాలని ఘాటుగానే అధికారులను హెచ్చరించారు. సంఘటన స్థలం నుంచి అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫోన్​చేసి వివాదం సద్దుమణిగేలా చేశారు. అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న వారి వద్ద ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు లేవని అటవీశాఖ అధికారులు స్పష్టంచేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.