Breaking News

షట్టర్​ దక్కలేదని అక్కసు!

షట్టర్​దక్కలేదని అక్కసు
  • అధికారులకు ఓ నాయకుడి ఫిర్యాదు
  • సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత


సామాజికసారథి, బిజినేపల్లి: తనకు న్యాయం చేయాలని, సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏదైనా పని చట్టవిరుద్ధంగా చేస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేయడంలో తప్పులేదు. కానీ అందులో తనకు వాటా దక్కలేదని ఫిర్యాదు చేయడమే వివాదాస్పదమైంది. ఒక మంచి ఉద్దేశంతో పేదలకు ఉపయోగపడాలన్న తపనతో చేస్తున్న పనిని అడ్డుకోవాలని నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ ముస్లిం నాయకుడు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిజినేపల్లి మండలం కేంద్రంలో మహబూబ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై సర్వే నం.487లో ముస్లిం శ్మశానవాటికకు చెందిన 2.20 గుంటల భూమి ఉంది. ఇది ప్రధాన రహదారిని ఆనుకుని ఉండటంతో మండల కేంద్రంలో పేదముస్లింలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో అన్ని నిబంధనలకు అనుగుణంగా ప్రధాన రహదారి వెంట సుమారు 30 షాపింగ్ ​షట్టర్లను నిర్మిస్తున్నారు. అవి ఎవరికి కేటాయించాలో కూడా ముస్లిం పెద్దలు అందరూ కూర్చుని నిర్ణయించుకున్నారు. కానీ బిజినేపల్లిలో టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్​చార్జ్​ అని చెప్పుకునే గఫూర్ అనే వ్యక్తికి షట్టర్ దక్కకపోవడంతో దానికి వ్యతిరేకంగా అది జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. అన్నిరకాల పర్మిషన్లు తీసుకుని నిర్మిస్తున్న సదరు నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు చేయడం ఏమిటని, అది కేవలం పేదవారికి సహాయం చేయడానికి మాత్రమే ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అయినా గఫూర్ అనే వ్యక్తి స్వస్థలం బిజినేపల్లి కాదని, ఆయన గద్వాల నుంచి ఇక్కడికి వచ్చాడని, అందుకే ఆయనకు కేటాయించలేదని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. అయినా కేవలం అధికారపార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు అధికారులు కూడా పూర్తి అండదండలు అందిస్తున్నారు.