- 570 టీఎంసీల నీటివాటా రాకుండా సంతకాలు
- సమస్యల పరిష్కారానికి ఆగస్టు 9 నుంచి పాదయాత్ర
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్
సారథి, కొల్లాపూర్: తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానది జలాల నుంచి 570 టీఎంసీల నీటివాటా రావాల్సి ఉండగా, సీఎం కేసీఆర్, చంద్రబాబుతో కుమ్మక్కై 299 టీఎంసీల నీటివాటా కోసం సంతకాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ ఫొటోలు తగిలించుకొని ఫోజులు ఇస్తున్నారని విమర్శించారు. సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణంతో పాటు 167కే జాతీయ రహదారి నిర్మాణంతో నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు కొల్లాపూర్ నియోజకవర్గ రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 167కే జాతీయ రహదారిని మంజూరుచేసి సోమశిల– సిద్ధేశ్వరం మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి రూ.1200 కోట్లు మంజూరు చేసిందన్నారు.
ఆగస్టు 9న పాదయాత్ర
హైదరాబాద్ నగరంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని విస్తరించి తీరుతామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల మేర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహన్ని నెలకొల్పుతామన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఆగస్టు 9న హైదరాబాద్లోని పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ నాటికి దేశప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీజేపీ ఏ మతానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. హిందువులకు అన్యాయం జరిగితే మాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో నిధులు, నియామకాలు ఎక్కడికి వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలో రాజ్యమేలుతుంటే ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలు దు:ఖిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో కాషాయం జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తంచేశారు.
సమస్యలు పరిష్కరించండి
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మాదాసి కురువ, మాదారి కురువులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని, విద్యావలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయా సంఘాల ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కు వినతిపత్రాలను అందజేశారు. ఈ సభలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి.ఆచారి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జ్ బంగారు శృతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడారు.
బండి సంజయ్కు ఘనస్వాగతం
అంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు నాగర్ కర్నూల్ నుంచి కార్యకర్తలు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో పార్టీ జెండాను బండి సంజయ్ ఆవిష్కరించి ర్యాలీగా బయలుదేరి సోమశిల గ్రామానికి చేరుకున్నారు. సోమశిల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని ఆయన సందర్శించి నదిలో పూలు చల్లి పూజలు చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్, మూల భరత్ చంద్ర, కాశీపురం మహేష్, కాకి సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.