Breaking News

సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని డిండిలో ముంచాలే

సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని డిండిలో ముంచాలే
  • రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం
  • కార్పొరేట్​ శక్తులకు చేతుల్లోకి వ్యవసాయం
  • సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

సారథి న్యూస్​, దేవరకొండ: దళిత, గిరిజనులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని డిండి ప్రాజెక్టులో ఎత్తేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రాంతానికి డిండి ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొస్తానని చెప్పిన సీఎం కేసీఆర్​ ఐదేళ్లలో ఒక్క ఎకరాకైనా పారించారా? అని అని ప్రశ్నించారు. రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం దాగున్నాయని, ఈ నేపథ్యంలో మరో ఉద్యమానికి రైతులు సిద్ధమవుతున్నారని స్పష్టంచేశారు. రైతులతో ముఖాముఖి, పొలంబాట, పోరుబాటలో భాగంగా కాంగ్రెస్​ నేతల బృందం బుధవారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం తవక్లాపూర్ గ్రామరైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి అన్నంపెట్టే రైతు వెన్నెముకను విరగ్గొట్టి కార్పొరేట్​శక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కోనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే తమ బతుకులు ఏమవుతాయనే భయాందోళనలో రైతులు ఉన్నారని చెప్పారు. రైతుల పరిస్థితులు ఇంత అధ్వానంగా ఉన్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే దళిత, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న సీఎం కేసీఆర్, కొత్తగా భూమి ఇవ్వకపోగా నాడు ఇందిరమ్మ ఇచ్చిన భూములను లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు.
డిండికి నీళ్లు ఎలా?
డిండి పేరుతో రూ.వేలకోట్ల రూపాయలు విడుదల చేసి కాల్వలు తవ్వించారని, కానీ అసలు ఇక్కడికి నీళ్లను ఎక్కడి నుంచి తీసుకువస్తారో చెప్పాలని భట్టి డిమాండ్ ​చేశారు. చెరువు ఎక్కడుందో చెప్పకుండా కాల్వలు తవ్వితే ఎలా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలనతో ఏడేళ్లుగా పేదలు, దళిత, గిరిజనులు మోసానికి గురవుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తానన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని డిండి ప్రాజెక్టు, లేక బంగాళాఖాతంలో పడేయాలని పునరుద్ఘటించారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎస్టీ సెల్ చైర్మన్ జగన్ లాల్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పాల్గొన్నారు.