అక్రమార్కులకు ఖాకీ దన్ను
- పాలెంలో నకిలీ ప్లాట్ల అమ్మకంలోనూ సహకారం
- హైదరాబాద్‌లో ఉండి చక్రం తిప్పుతున్న అధికారి
- కబ్జాదారులు.. కాలనీవాసులపై దాడి
- ఎఫ్ఐఆర్ కాకుండా రంగంలోకి స్థానిక పోలీసులకు వార్నింగ్
సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం గ్రామంలో తోటపల్లి సుబ్బయ్య కాలం నాటి రూ.కోటి విలువైన పార్కు స్థలం ఆక్రమణకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ‘పార్కుస్థలం కబ్జా’ అనే శీర్షికన ‘సామాజికసారథి’ సోమవారం అక్రమార్కుల బాగోతాన్ని బయటపెట్టింది. ఈ కథనంపై మండల అధికారులు స్పందించడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీంతో ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు. కబ్జాదారుడు మద్యంసేవించి రాత్రి వేళలో కాలనీవాసులపై దాడిచేశాడు. దీనిపై గాయపడిన బాధితులు బిజినేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సోమవారం రాత్రి సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. సమగ్రంగా వివరాలను సేకరించారు. ఆ సమయంలోనే కబ్జాదారులు కుటుంబంలో ఒకరు తమకు సంబంధించిన హైదరాబాద్‌లో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతారు.. అంటూ స్థానిక పోలీసులకు ఫోన్ఇచ్చారు. సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసు నమోదు కాకుండా చూసుకోవాలని, దీనిపై కేసునమోదు చేస్తే తాను హైదరాబాద్‌లో పనిచేస్తున్నానని ఉన్నతాధికారుల ద్వారా మీకు ఇబ్బందులు తప్పవని.. మీరు ప్రమోషన్ల కోసం ఇక్కడికే వస్తారని.. అప్పుడు చూసుకుంటానని స్థానిక పోలీసులను హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భూకబ్జాదారులపై కేసు నమోదు చేసేందుకు బిజినేపల్లి పోలీసులు తర్జనభర్జనలు పడుతున్నారు.
అక్రమాల వెనుక సీఐ?
పార్కుస్థలం కబ్జా చేసిన వారు గతంలోనూ పాలెం గ్రామంలో కొందరికి నకిలీ ప్లాట్లను అమ్మగా వారు అప్పుడు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ఫిర్యాదుచేశారు. అదే సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగంలోకి దిగి పోలీస్ కేసు నమోదు కాకుండా బంధువులను వెనకేసుకొచ్చాడు. అంతేకాకుండా పాలెం గ్రామంలో ఒక ఉపాధ్యాయుడిపై దాడి చేసిన విషయంలోనూ సదరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు కాకుండా బంధువులకు అండగా నిలిచారు. దీనిపై ప్రస్తుతం కబ్జా విషయంలోనూ ఇలానే వ్యవహరిస్తుండడంతో బిజినేపల్లి పోలీస్ స్టేషన్‌పై సదరు అధికారి పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూ బాధితులకు న్యాయం చేయాల్సిన సదరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇలా వార్నింగ్ఇవ్వడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులను ప్రోత్సహిస్తున్న సీఐపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
పాలెం గ్రామంలో సుబ్బయ్య కాలంలోనే డిగ్రీ కళాశాల, ఉన్నత పాఠశాల, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ వంటి కోర్సులు ఉండటంతో ఇక్కడ ఎక్కువమంది టీచర్లు నివాసం ఉండేవారు. అయితే వారందరి కోసం పక్కాఇళ్లు నిర్మిస్తే బాగుంటుందని భావించారు. వివిధ గ్రామాల నుంచి ఎక్కడి నుంచో వచ్చి టీచర్లు పనిచేసేందుకు వీలుగా ఉంటుందని ఇక్కడి విద్యార్థులకు సైతం మేలు కలుగుతుందని యోచించారు. ఆ ఉద్దేశంతోనే 1968లో ప్రస్తుతం ఉన్న టీచర్స్ కాలనీ సర్వేనెం.285లో ఎస్సీల నుంచి భూములను కొనుగోలుచేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ సొసైటీ ద్వారా డీటీసీపీ లే అవుట్ ఏర్పాటు చేసి 80 పక్కాఇళ్లను నిర్మించి ఉపాధ్యాయులకు ఇచ్చారు. అయితే అందులో పిల్లలు ఆడుకోవడానికి, వృద్ధులు సేదతీరడానికి వీలుగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఇదే సర్వేనం.లో 20 గుంటల(అర ఎకరా)స్థలంలో మంచి పార్కును కూడా రూపుదిద్దారు. ఈ పార్కు ప్రస్తుతం కబ్జారాయుళ్ల చేతిలోకి వెళ్లింది. దీని విలువ సుమారు రూ.కోటి మేర ఉంటుంది.