- రాష్ట్రాన్ని ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
సామాజికసారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో సీఎం కేసీఆర్చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొండలో ఏర్పాటుచేసిన నిరసన సభలో అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కమలం జెండా ఎగరవేస్తామని వ్యక్తం చేశారు. ఉద్యోగులకు శాపంగా మారిన 317 జీవోకు వ్యతిరేకంగా తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బదిలీలకు సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభ్యంతరాలు తెలిపితే ఎన్ని పరిశీలించారో.. ఎన్ని పరిష్కరించారో సీఎం కేసీఆర్చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు తెగించి కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 10వ తేదీ వచ్చినా 13 జిల్లాల్లో ఇంకా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం అనేక కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామేనని బండి సంజయ్ గుర్తు చేశారు.
కేసీఆర్ నియంతృత్వం చెల్లదు
అసోం చిన్నరాష్ట్రమైనా తెలంగాణ కంటే అద్భుతంగా పనిచేస్తోందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. రూ.లక్షల కోట్ల ఆదాయం ఉన్నా.. టీఆర్ఎస్సర్కారు ఒక కుటుంబం కోసమే పనిచేస్తోందని విమర్శించారు. తెలంగాణ వద్దన్నవారికి కేసీఆర్ దావత్ లిస్తున్నారని ఆరోపించారు. శనివారం సీఎం కేసీఆర్ వామపక్ష నేతలతో ప్రగతి భవన్లో ప్రత్యేకంగా భేటీ కావడాన్ని బిశ్వశర్మ ప్రశ్నించారు. ఔరంగజేబ్, నిజాం వారసత్వాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారని, పోలీసుల సపోర్ట్‌తో ఎన్నిరోజులు పరిపాలిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ నియంతృత్వం ఇక చెల్లబోదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.