సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు పంచాయతీలో వారం నుంచి కరోనా వైరస్ ఉధృతి 30శాతం పాజిటివ్ రేటు పెరుగుతోంది. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖ ద్వారా జిల్లా కలెక్టర్ కు తెలియజేయగా, ఆయన స్పందించి ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా చేయాలని ఆదేశించారు. శుక్రవారం మోతుకులగూడెం, రేగులపాడు, బయ్యారం గ్రామాలను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గ్రామస్తులను 14రోజుల పాటు వేరే ఊరికి వెళ్లకుండా, ఇతరులు ఆ ఊరుకు రాకుండా స్వీయనియంత్రణ పాటించాలని ఆదేశించారు. షాపులను మూసివేయాలని, ఇద్దరి కంటే ఎక్కువమంది గుమిగూడి ఉండకూడదని సూచించారు. తహసీల్దార్ అల్లం రాజ్ కుమార్, ఎంఆర్ఐ మురళికృష్ణ, ఎచ్ఈవో పాయం వేణుగోపాలకృష్ణ, సర్పంచ్ అనంతలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రవీందర్, పోలీస్, రెవిన్యూ, పంచాయతీ సిబ్బంది ఆయా గ్రామస్తులకు కొవిడ్ వ్యాప్తి, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.