- ఏపీలో నవోదయ స్కూళ్లు ఏర్పాటు చేయండి
- కోస్తా తీరంలో నాలుగులేన్ల రోడ్లు నిర్మించండి
- కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్ వినతి
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ రెండో రోజు పర్యటన బిజీబిజీగా సాగింది. సోమవారం ప్రధానితో సమావేశమైన ఆయన మంగళవారం కేంద్ర మంత్రులను కలిసి వివిధ ప్రాజెక్టులు, నిధులపై చర్చించారు. రాష్ట్రంలో నవోదయ పాఠశాలల ఏర్పాటు, కేంద్ర విద్యా సంస్థలకు బ్జడెట్‌లో నిధులు, నూతన విద్యావిధానం అమలుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కింద కేంద్రం ఏర్పాటు చేసే ఏడు మెగా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. కోస్తా తీర ప్రాంతంలో నాలుగు లైన్ల రోడ్డును నిర్మించాలని, విశాఖ భోగాపురం మధ్య జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అలాగే ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి, ప్రభుత్వ ఓటీటీ స్ట్రీమిగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు అంశాలపై కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌ను కలిసి చర్చించారు.