Breaking News

అవసరమైన చోట ఆస్పత్రిని కట్టండి

అవసరమైన చోట ఆస్పత్రిని కట్టండి

సారథి, మానవపాడు: పుష్కరాల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలో భాగంగా అలంపూర్ నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రిని మంజూరుచేస్తే స్థానిక నాయకులు కొందరు రచ్చరచ్చ చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే చోటును కాదని అడ్డుపడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి ఆక్షేపించారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని అతిథిగృహంలో ఆయా గ్రామాల సర్పంచ్​లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సెంటర్ పాయింట్ అయిన అలంపూర్ చౌరస్తాలో 44వ జాతీయ రహదారి పక్కన వంద పడకల ఆస్పత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. కొంతమంది స్వార్థపూరితంగా అలంపూర్ పట్టణంలో ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని నిరసనలు వ్యక్తం చేయడం, మీడియా ప్రకటనలు చేయడం సరికాదన్నారు. అలంపూర్ పట్టణంలో వంద పడకల ఆస్పత్రిని నిర్మిస్తే మిగతా ఏడు మండలాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులకు గురవుతారని వివరించారు. ఈ విషయంపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షచేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్​లు నర్సింహులు, హేమావతి దామోదర్ రెడ్డి, కాంతారెడ్డి, తఅయ్యన్న, జగ్గుల శివరాం పాల్గొన్నారు.