
సామాజికసారథి, మానకొండూరు: మానకొండూరులో బీఎస్పీ జెండా గద్దెకూల్చివేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించాలని నేరుగా మానకొండూరు పోలీస్‌స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎస్పీకి వస్తున్న ఆదరణను చూసి అధికార టీఆర్ఎస్ నేతలు వణుకుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలే గానీ ఇలాంటి పిరికిపంద చర్య సరికాదన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భయం ఎందుకని ప్రశ్నించారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడెకరాల పొలం వంటి హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటామని అన్నారు. బీఎస్పీ జెండా గద్దెను ధ్వంసం చేయించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను అరెస్ట్ చేయాలని పలువురు బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం మానకొండూరు నియోజకవర్గంలో బీఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగుతోంది. కార్యక్రమంలో బీఎస్పీ నేతలు నిషాని రామచంద్రం, స్వరూప తదితర ఉన్నారు.