- కేంద్రం అనుమతి రావడంతో ఏర్పాట్లు చేయండి
- రెండు డోసుల వ్యాక్సిన్తప్పనిసరి తీసుకోవాలి
- అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష
సామాజికసారథి, హైదరాబాద్: కరోనాకు బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వచ్చేనెల 3 నుంచి మూడో డోసు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభావం తక్కువ ఉందని చెప్పారు. ఒమిక్రాన్ సోకి టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, కోలుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్లలోపు వారు 22.78 లక్షల మంది, 60 ఏళ్లకు పైబడినవారు 41.60 లక్షల మంది, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వారియర్లు 6.34 లక్షలు ఉన్నారని తెలిపారు. వీరందరికీ దాదాపు 70 లక్షల వ్యాక్సిన్లు అవసరం ఉంటుందని, వచ్చేనెల 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వారికి, జనవరి 10 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ మూడో దశ ఉధృతమైనా ఎదుర్కొనేలా ప్రభుత్వం ఇప్పటికే చేసిన ఏర్పాట్లను విభాగాల వారీగా సమీక్షించుకోవాలని సూచించారు. కరోనా రాష్ట్రంలో అదుపులోనే ఉందన్నారు. జాతీయస్థాయిలో మొదటి డోసు సగటు 90 శాతం ఉండగా.. రాష్ట్రంలో 99.46 శాతం పూర్తయిందన్నారు. రెండో డోసు విషయంలో జాతీయ సగటు 61 శాతం ఉండగా, రాష్ట్రసగటు 64 శాతం ఉందన్నారు. ప్రతిఒక్కరూ రెండు డోసులూ వేసుకోవాలని, రెండో డోసు విషయంలో మరింత వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు మాస్కు ధరించాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.