Breaking News

భగీరథ..నీటిలో చేపపిల్లలు

భగీరథ..నీటిలో చేప పిల్లలు

సామాజిక సారథి, జోగిపేట: మిషన్ భగీరథ నీటిలో చేప పిల్లలు ప్రత్యక్షమవుతున్నాయి. గత మూడు రోజులుగా మంచినీటి కనెక్షన్ ద్వారా చేప పిల్లలు వస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా, శనివారం కూడా మంచినీటిలో చేప పిల్లలు రావడంతో ఈ విషయం జోగిపేటలో దహనముల వ్యాపించింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే… సంగారెడ్డి జిల్లా  అందోలు – జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో దాదాపు 60 నుంచి 65 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారందరి ఇళ్లకు  ప్రభుత్వం మిషన్ భగీరథ మంచి నీటి కనెక్షన్ లను బిగించింది. మంచినీటి పైపుల ద్వారా వస్తున్న చేప పిల్లలు అధికశాతం చనిపోయినవి ఉండగా, ఒకటి, రెండు ప్రాణంతో ఉన్నవి వస్తున్నట్టు  కాలనీవాసులు తెలిపారు. మరి ఒక ఇంచే ఉన్న నల్ల కనెక్షన్ నుంచి  చేప పిల్లలు ఎలా వచ్చాయి అన్నదేగా మీ సందేహం?  కొంతమంది ఆన్, ఆఫ్ లేకుండా రెండు ఇంచ్ ల మిషన్ భగీరథ బ్లూ కలర్ పైప్ ను ఇంటి లోపల గల నీటి సంప్ లో నేరుగా వదలడంతో చేప పిల్లలు ఆ పైప్ ద్వారా వస్తున్నాయి.

మెయిన్ పైప్ మరమత్తు సమయంలో..

అందోలు – జోగిపేట మున్సిపాలిటీకి సరఫరా అయ్యే మిషన్ భగీరథ మంచినీటి ప్రధాన పైప్లైన సంప్  హౌస్ పుల్కల్ మండలం పోచారం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంప్ హౌస్ వద్ద ప్రధాన పైప్ లైన్ లో ఏర్పడిన చిన్నపాటి లీకేజ్ ను మరమ్మత్తు చేసే సమయంలో చేప పిల్లలు పైప్ లైన్ లో చేరి ఉంటాయి. హౌసింగ్ బోర్డు కాలనీవాసులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడంతో అక్కడ నిర్మించిన మిషన్ భగీరథ మంచినీటి ట్యాంక్ నుంచి నీటిని పూర్తిగా బయటకు వదిలి, శుభ్రం చేసి కొత్తగా మంచి నీటిని నింపడం జరుగుతుంది.

          – కృష్ణ, ఏ డబ్ల్యూఓ