- కొండాపురంలో దారుణం
- పండుగ పూట విషాదం
- ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం.
సామాజిక సారథి, వెంకటాపురం: పండగ పూట విషాదం నెలకొన్నది. కత్తితో దాడిచేయడంతో ఒకరు చనిపోవడంతో పాటు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపురం గ్రామంలో జరిగింది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం..గ్రామానికి చెందిన దుర్గం చంటికి భార్య, కుటుంబసభ్యులకు మధ్య కొంతకాలంగా కుటుంబకలహాలు, గొడవలు ఉన్నాయి. ఈ సందర్భంగా మానవ మృగంగా మారిన చంటి, భార్య లోకేశ్వరి, అమ్మమ్మ ఆదిలక్ష్మి, అత్త సమ్మక్కను కత్తితో ముగ్గురిపై అతి దారుణంగా, విచక్షణారహితంగా దాడిచేశాడు. అమ్మమ్మ ఆదిలక్ష్మి అక్కడికక్కడే రక్తపుమడుగులో మృతిచెందింది. భార్య లోకేశ్వరి, అత్త సమ్మక్క తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న భార్య, అత్తను స్థానికుల సహాయంతో కుటుంబసభ్యులు వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య లోకేశ్వరి కోమాలో ఉండగా, అత్త సమ్మక్క పరిస్థితి విషమంగా ఉంది. ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడు చంటిని తాళ్లతో కట్టివేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.