Breaking News

పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం

  • December 17, 2022
  • Archive
  • Comments Off on పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం
పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం

  • నార్మల్ డెలివరీ కోసం 12 గంటల పాటు నిరీక్షణ
  • డ్యూటీ డాక్టర్ నిర్లక్యంతో పసికందు బలి
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం

సామాజికసారథి, పటాన్‌చెరు: నార్మల్ డెలివరీ కోసం 12 గంటల పాటు నిరీక్షించడంతో ఓ పసికందు చనిపోయింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, మహిళ కుటుంబ సభ్యులతో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్ పూర్ మున్సిపాలిటీ లింగమయ్య కాలనీకి చెందిన వినోద అనే గర్భిణి ఈనెల 11న ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు పురిటి నొప్పులతో పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ చేస్తామని ఆస్పత్రి డ్యూటీ డాక్టర్ శ్రీవాణి చెబుతూ సాయంత్రం 5 గంటల పాటు వెయిట్ చేయించారు. నొప్పులు తీవ్రతరం కావడంతో ఆపరేషన్ చేయాలని గర్భిణి మహిళ కోరినా వైద్యులు నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. పాప తల భాగం వరకు తీసి పరిస్థితి తమ అదుపులో లేదన్న విషయాన్ని పసిగట్టి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి పంపించారు. సంగారెడ్డిలో డెలివరీ చేయగా పాప పరిస్థితి విషమంగా ఉండడంతో నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అప్పటికే పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయినట్లు నిలోఫర్ వైద్యులు చెప్పారన్నారు. పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప ప్రాణం కోల్పోయిందని బాధిత మహిళ, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన‌ ఐదారు రోజులకు వెలుగులోకి రావడంతో బీజేపీ నాయకులు బాధిత ‌కుటుంబసభ్యులతో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు.
ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు సి.గోదావరి అంజిరెడ్డి, గడీల శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్ ఎడ్ల రమేష్‌ మాట్లాడుతూ అన్యాయాలకు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రి మారిందని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ ‌డాక్టర్, సూపరింటెండెంట్ ‌పై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.