Breaking News

కూకట్​పల్లి ఏటీఎం దొంగలు.. దొరికారు?

కూకట్​ పల్లి ఏటీఎం దొంగలు.. దొరికారు?

  • హెచ్​డీఎఫ్​సీ ఏటీఎంలో క్యాష్​ పెడుతుండగా దొంగల కాల్పులు
  • ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
  • రూ.5లక్షలు దోచుకెళ్లిన దుండగులు
  • సంగారెడ్డిలో నిందితులను పట్టుకున్న పోలీసులు

సారథి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏటీఎం సిబ్బందిపై దుండగులు కాల్పులకు తెగబడిన దుండగులు పారిపోతూ సంగారెడ్డి పోలీసులకు పట్టుబడ్డారు. కూకట్​పల్లి పటేల్‌కుంట పార్కు సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ లో గురువారం డబ్బులు పెట్టేందుకు వెళ్లగా అల్వీన్‌ కాలనీ వైపు నుంచి పల్సర్‌ బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు కాల్పులకు దిగారు. ఇద్దరు ఏటీఎం సిబ్బందితో పాటు సెక్యూరిటీ గార్డుపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. వారివద్ద ఉన్న రూ.ఐదులక్షల డబ్బును తీసుకొని ఉఢాయించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిబ్బంది అలీబేగ్‌ చికిత్స పొందుతూ చనిపోయాడు. శ్రీనివాస్‌ పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసులు సంఘటన స్థలంలో రెండు బుల్లెట్లు, బుల్లెట్‌ లాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కూడా ఘట స్థలాన్ని పరిశీలించారు. దుండగులు భాగ్యనగర్‌ వైపునకు పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. స్థానిక ఏటీఎం సెంటర్​తో పాటు భాగ్యనగర్​ కాలనీ, ఆల్విన్​ కాలనీ వైపు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే దోపిడీ అనంతరం దుండగులు సంగారెడ్డి మీదుగా నాందేడ్ వైపునకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా గురువారం రాత్రి ఎస్ వోటీ పోలీసులు వారిని సంగారెడ్డిలో అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.