- నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా భర్తీ
- నాగర్ కర్నూల్ డీపీఆర్వో సీతారాం నాయక్ ఇష్టారాజ్యం
- నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలోని డిస్ట్రిక్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(డీపీఆర్వో) ఆఫీస్ లో ఖాళీగా ఉన్న ఏపీఆర్వో (అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) పోస్టులను అంగట్లో అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని డీపీఆర్వో ఆఫీస్ లో నియామకం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో దీన్ని ఆసరాగా తీసుకున్న నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల డీపీఆర్వో సీతారాం నాయక్ సరికొత్త దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఏపీఆర్వో పోస్టులతో పాటు పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో కెమెరామెన్) ఉద్యోగాలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సీ ఉంటుంది. వీరిలో ఏపీఆర్వోకు ప్రతినెలా జీతం రూ.36,750, పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో కెమెరామెన్) కు ప్రతినెలా జీతం రూ.27,130 చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేసి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మాత్రం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఈ రెండు జిల్లాల్లో డీపీఆర్వోగా పనిచేస్తున్న సీతారాం నాయక్ తనకు అనుకూలంగా ఉన్న వారిని కనీసం జిల్లా కలెక్టర్ నోటిసులో కూడా లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేయడంపై టీయూడబ్ల్యూజే హెచ్ 143 ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అడ్డదారిలో నియమించిన ఏపీఆర్వో , పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో కెమెరామెన్) ఉద్యోగాలను వెంటనే రద్దు చేసి రూల్స్ ప్రకారం నోటిఫికేషన్ ద్వారా అర్హులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం టీయూడబ్ల్యూజే హెచ్ 143 సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు జిల్లా సంఘం అధ్యక్షుడు ఖానాపురం ప్రదీప్, రాష్ట్ర నాయకులు అబ్దుల్లాఖాన్, శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్ డీపీఆర్వో కు వినతిపత్రం అందజేశారు.
వనపర్తిలో మంత్రి కనుసన్నల్లోనే నియామకం
వనపర్తి జిల్లాలో ఏపీఆర్వో ఉద్యోగాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కనుసన్నల్లోనే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నియమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీఆర్వోగా పనిచేస్తున్న వ్యక్తి స్థానిక గవర్నమెంట్ మహిళా డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పనిచేస్తూనే తన స్వంత యూట్యూబ్ ఛానల్ లో మంత్రి నిరంజన్ రెడ్డి మెప్పు పొందేందుకు అనుకూల వార్తలు మాత్రమే ప్రసారం చేస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. పైగా వనపర్తి జిల్లాలో ఏ ప్రభుత్వ ఉద్యోగం కావలన్నా మంత్రి ఆదేశిస్తే అధికారులు ఎలాంటి నిబంధనలు ఉన్నా వాటిని పక్కకు పెట్టి మంత్రి ఆదేశాలను పాటిస్తారన్న అపవాదు ఉంది. పైగా ఎన్నికల సమయంలో డీపీఆర్వో కార్యాలయంలో తమకు చెందిన వ్యక్తి ఉంటే ఉపయోగం ఉంటుదన్న నిర్ణయంతో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా వనపర్తి జిల్లాలో సైతం ఏపీఆర్వో పోస్టును భర్తీచేశారని ఇతర జర్నలిస్టులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీంతో పాటు మంత్రికి అనుకూలంగా ఉన్న ఓ ఫొటో గ్రాఫర్ ను సైతం ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే డీపీఆర్వో ఫొటోగ్రాఫర్ గా నియమించుకోవడం అప్పట్లోనే జిల్లాలో చర్చనీయాంశమైంది. తాజాగా ఏపీఆర్వో ఉద్యోగాన్ని సైతం మంత్రి నిరంజన్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తికే ఇప్పించడం మరింత చర్చకు దారితీస్తోంది. ఇప్పటికైనా అడ్డదారిలో నియమితులైన వారిని తొలగించి నోటిఫికేషన్ ద్వారా ఏపీఆర్వో, డీపీఆర్వో ఫొటోగ్రాపర్ ఉద్యోగాలను భర్తీచేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.