Breaking News

కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్

సారథి, బిజినేపల్లి: కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను హరించివేయడం సరికాదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ అన్నారు. బుధవారం ఆయన నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. మోడీ సర్కార్ రెండోసారి అధికారం చేపట్టాక కరోనా వైరస్ కారణంగా దేశం ప్రజలు బెంబేలెత్తిపోతున్నా ఏమీ పట్టించుకోకుండా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజల నడ్డివిరిచేస్తోందన్నారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నదాతలపై అక్రమ కేసులు బనాయించడం, మేధావులు, జర్నలిస్టులను జైలుపాలు చేయడం, దేశద్రోహం ముద్రవేయడం పరిపాటిగా మారిందన్నారు. ఈనెల 9న 14 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘సేవ్ ఇండియా’ పేరుతో నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్మికులు, కర్షకులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు శ్రీశైలం, ఆంజనేయులు, శ్రీనివాస్, బాలయ్య, నారాయణ, శ్రీను, పెద్దిరాజు, కృష్ణయ్య, ఆంజనేయులు, రేనయ్య, కురుమూర్తి, చంద్రయ్య, రాము, రామచంద్రయ్య గౌడ్, నిరంజన్ గౌడ్, బంగారయ్య, హనుమంతు, నాగేష్, వెంకటేశ్​పాల్గొన్నారు.