Breaking News

ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి

ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి
  • నిర్వహణపై అధికారుల తీరు మారాలి
  • గ్రామాల్లో పనులను పరిశీలించిన కలెక్టర్​ హరీశ్​

సారథి, పెద్దశంకరంపేట: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన పెద్దశంకరంపేట మండలంలోని జాంబికుంట, ఆరెపల్లి, కమలాపూర్, బుజ్రన్ పల్లి, కొల్లపల్లి తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులను తనిఖీ చేశారు. ఆరేపల్లిలో గోతుల్లో మొక్కలు ఉండకుండా, కలుపు మొక్కలు పెరగడంతో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం మొక్కలతో పాటు పల్లెప్రకృతి వనాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.

ఆరేపల్లిలో పల్లెప్రకృతి వనం నిర్వహణాలోపంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత సర్పంచ్​తో పాటు పంచాయతీ కార్యదర్శికి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. ఇదే విషయమై మండల పంచాయతీ ఆఫీసర్ రియాజొద్దీన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాంబికుంటలోని పల్లెప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. బుజ్రాన్ పల్లి, జాంబికుంట గ్రామాల్లోని పనుల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం కొల్లపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కలెక్టర్​పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎం‌పీపీ జంగం శ్రీనివాస్, మండల అభివృద్ధి అధికారి రాంనారాయణ, సర్పంచ్ లు సత్యనారాయణ, మానెమ్మ, సాయమ్మ, బుదెమ్మ, సాయిలు, మండల టీ‌ఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు, మురళిపంతులు, నాయకులు వీణాసుభాష్ గౌడ్, పున్నయ్య, తహసీల్దార్ చరణ్ సింగ్, ఆర్ఐ ప్రభాకర్ పాల్గొన్నారు.