- మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
- ఎకరాకు రూ.50 వేల నష్ట పరిహారం చెల్లించాలి
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
సామాజిక సారథి, ములుగు ప్రతినిధి : రాష్ట్రంలో మిర్చి రైతులు పంటలు దెబ్బతిని పురుగుల మందులు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైతుల ఆత్మహత్యలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని ఆమె పేర్కొన్నారు. ఆదివారం ఆమె ఏటూరు నాగారం మండలం రామన్న గూడెం గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మిర్చి పంటలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వర్షాల వలన గులాబీ తెగులు సోకి సుమారు రెండు వేల ఎకరాలలో మిర్చి పంట దెబ్బతిన్న పరిస్థితి ఉందని, ఒక ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టిన మిర్చి రైతులంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వాళ్లకి ప్రభుత్వం భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మిర్చి రైతు మిర్చితోటలో పురుగుల మందులు తాగి రైతులు చనిపోతుంటే ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు రైతుబంధు సంబురాలు చేసుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు. వందల ఎకరాలు ఉన్న నాయకులకు లక్షలలో కోట్లలో రైతుబంధు డబ్బులు పడితే, వాళ్లు సంబురాలు చేసుకుంటూ ఈ రోజు రైతుల సంబురాలు అంటున్నారు. దీన్ని తెలంగాణ రైతాంగం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం, మీరు రైతు సంబురాలు బంద్ చేసి రైతు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి పరిశీలించి రైతులకు ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాలని ఆమె సూచించారు. అలాగే ప్రభుత్వం తరఫున మిర్చి రైతులకు రూ. 50 వేల నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాల్సిందిగా ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అయుబ్ ఖాన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరుస వడ్ల వెంకన్న, జెడ్పీటీసీ నామ కరం చంద్ గాంధీ, మండల అధ్యక్షుడు చిట మట రఘు, ఎండీ చాంద్ పాషా, తోపాటు నాయకులు మైల జయరాం రెడ్డి, వావిలాల నర్సింహా రావు, వావిలాల చిన్న ఎల్లయ్య,ఎండీ ఖలీల్ ఖాన్, గడ్డం శ్రీధర్, ముక్కెర లాలయ్య, పూజారి సురేందర్ బాబు తదితరులు ఉన్నారు.