Breaking News

గవర్నమెంట్ టీచర్లు సమయ పాలన పాటించాలి

  • June 25, 2024
  • Top News
  • Comments Off on గవర్నమెంట్ టీచర్లు సమయ పాలన పాటించాలి

ఎంఈఓ లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి,

విద్య వ్యవసాయ శాఖలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రివ్యూ,

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో గవర్నమెంట్ స్కూళ్ల టీచర్లు తప్పకుండా సమయ పాలన పాటించాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి లు సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్య, వ్యవసాయ శాఖలపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారుల పర్యవేక్షణ లేక విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. గవర్నమెంట్ స్కూళ్లల్లో చదివిన ఎంతో మంది ప్రస్తుతం ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. కాని అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం తో ప్రభుత్వ విద్య అస్తవ్యస్తంగా, అధ్వాన్నంగా మారిందన్నారు.

జిల్లాలో డీఈఓ, ఎంఈఓ లు ప్రభుత్వ స్కూళ్లను పర్యవేక్షణ చేయకపోవడంతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. డీఈఓ గోవింద రాజులు ఇంచార్జీ బాధ్యతలతో ఇటు నాగర్ కర్నూల్ జిల్లాకు అటు వనపర్తి జిల్లాకు న్యాయం లేకపోతున్నారన్నారు. ఏ జిల్లాలోనూ సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో ప్రభుత్వ స్కూళ్లల్లో నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు సమయపాలన పాటించాలని మేము కూడా ఆకస్మికంగా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాలను పెంచాలని, విద్యార్థులకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎస్సీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో కనీస వసతులపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. ప్రైవేటు పాఠశాలల్లో అడ్డగోలు ఫీజుల నియంత్రించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి తమకు నివేదిక అందించాలని అన్నారు.

నకిలి విత్తనాలు..

ఎరువులు అమ్మితే చర్యలు..

దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న కు జిల్లాలో నకిలి విత్తనాలు, ఎరువులు అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్ హెచ్చరించారు. జిల్లాలో రైతులను మోసం చేసే వ్యాపారులను, నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపాలని వ్యవసాయ శాఖ అధికారులకు వారు ఆదేశించారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పై ప్రతి వ్యవసాయ అధికారి దగ్గర తప్పక నివేదికలు ఉండాలన్నారు. జిల్లాలో నకిలీ అని మాట వినిపిస్తే అధికారులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు సరిపోయే విత్తనాలను గ్రామాలకు పంపిణీ చేయడమే కాకుండా వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని అన్నారు. రైతులకు అందించే సబ్సిడీ విత్తనాలపై ఎరువులపై గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని గ్రామాలకు ఎంత ఎరువులు , విత్తనాలు, యంత్రాలు కావాలో తమకు నివేదిక అందిస్తే వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి వారికి అందజేస్తామన్నారు. రైతుల దగ్గర ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఏ ఒక్క వ్యవసాయ అధికారి పైన రైతులు తమకు ఫిర్యాదు చేస్తే అధికారిపై చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఫామ్ ఆయిలపై రైతులకు అవగాహన కల్పించి ఎక్కువ రాయితీ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పంట మార్పిళ్లపై రైతులకు అవగాహన కల్పించి అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ అధికారులు సహకరించాలని కోరారు.