Breaking News

‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం

‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం

  • రాతిపెడ్డలు కూలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి
  • కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: పాలమూరు ఎత్తిపోతల పథకం సొరంగం పనుల్లో రాయి కూలి వ్యక్తి మృతిచెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలో పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా సొరంగం (టన్నెల్) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా, ఉయ్యాలవాడకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గొంది శ్రీనివాస్ రెడ్డి రోజూ లాగే నీళ్ల ట్రాక్టర్ తీసుకొని టన్నెల్​ లోపలకి వెళ్లాడు. 400 మీటర్ల లోపలికి వెళ్లాక సొరంగంలోని పైకప్పు నుంచి రాతిపెడ్డలు కూలిపడ్డాయి. ఈ ఘటనలో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతని వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతిచెందాడు. అతని వెంట మరో నలుగురు ఉండగా వారికెలాంటి గాయాలు తగలలేదు. సాధారణంగా సొరంగంలోకి వెళ్లడం ప్రమాదంతో కూడుకున్నది. పనులు పూర్తికాక ముందు పైనుంచి రాళ్లు కూలే ప్రమాదం ఉంటుంది. కావునా సరైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. డ్రైవర్ ట్రాక్టర్​తో లోపలి వెళ్లేటప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకోకుండానే వెళ్లినట్లు తెలిసింది. జాగ్రత్తలు తీసుకోకుండా సొరంగంలోకి వెళ్లడం ప్రమాదమని తెలిసినా కూడా ప్రాజెక్టు కాంట్రాక్టర్లు హెల్మెట్ ఇవ్వకుండా, తగు జాగ్రత్తలు తీసుకోకుండానే ట్రాక్టర్​ను సొరంగంలోకి పంపించడం గమనార్హం.