- చిత్తరంజన్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ రెండో క్యాంపస్
- వీడియో కాన్ఫరెన్స్ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ
కోల్‌కతా: దేశంలోని ప్రతి పౌరుడికి అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసే దిశగా మరో అడుగు వేశామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు, ఎవరైనా కేన్సర్‌తో పోరాడుతున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడంతో దేశం ఈ సంవత్సరాన్ని ప్రారంభించిందని ప్రధాని మోడీ అన్నారు. అదే సమయంలో ఈ ఏడాది మొదటి నెల మొదటి వారంలోనే, దేశం కూడా 150 కోట్ల వ్యాక్సిన్ డోసుల చరిత్రాత్మక మైలురాయిని దాటిందని చెప్పారు. శుక్రవారం కోల్‌కత్తాలో చిత్తరంజన్ కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో రెండో క్యాంపస్‌ను పశ్చిమ బెంగాల్సీఎం మమత బెనర్జీతో కలిసి ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 90 శాతానికి పైగా వ్యాక్సిన్‌ను ఒక మోతాదును పొందారని ప్రధాని పేర్కొన్నారు. కేవలం ఐదు రోజుల్లోనే 1.5 కోట్ల మందికి పైగా పిల్లలకు వ్యాక్సిన్ డోస్‌ను కూడా అందించామన్నారు. ఈ విజయం దేశం మొత్తానికి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. కేన్సర్ వ్యాధి పేరు వినగానే పేద, మధ్యతరగతి వారు ధైర్యం కోల్పోయారని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను ఈ విషవలయం నుంచి బయట పడేయడానికి దేశం నిరంతర చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కొన్నేళ్లుగా కేన్సర్ వైద్యచికిత్సకు అవసరమైన మందుల ధరలు గణనీయంగా తగ్గాయని గుర్తుచేశారు. అందులో భాగంగా కోల్‌కతాకు చెందిన చిత్తరంజన్ నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఈ క్యాంపస్‌ను రూ.530 కోట్లతో నిర్మించామన్నారు. ఈ కొత్త క్యాంపస్‌లో 460 పడకలతో కూడిన సమగ్ర కేన్సర్ యూనిట్‌లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.