కోల్‌కతా : కరోనా వైరస్‌తో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతుంటే.. ఇదే అవకాశంగా తీసుకుని జేబులు నింపుకుంటున్నారు. కోల్‌కతాలో ఆరు కి.మీ.దూరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఓ అంబులెన్స్ డ్రైవర్ రూ.9200 డిమాండ్ చేశాడు. అంతమొత్తం చెల్లించలేమని చెప్పిన ఇద్దరు కరోనా పాజిటివ్‌గా తేలిన బాలురు, వారి తల్లిని అర్ధంతరంగా వాహనం నుంచి దిగిపొమ్మని చెప్పాడు. వైద్యులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు రూ.2,000 తీసుకునేందుకు అంగీకరించాడు. కోవిడ్-19గా నిర్ధారణ కావడంతో సోదరులైన ఇద్దరు బాలురు శుక్రవారం నుంచి కోల్‌కతాలోని చైల్డ్ హెల్త్ ఇనిస్టిట్యూట్ (ఐసీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. మరుసటి రోజు వైద్యుల సూచనలతో వారిని అక్కడి నుంచి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు బాలుడి తండ్రి అంబులెన్స్‌ను పిలిపించారు. వారిని ఐసీహెచ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని కోల్‌కతా మెడికల్ కాలేజ్ ఆస్పత్రి (కేఎంసీహెచ్)కు తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్ రూ.9200 డిమాండ్ చేశాడని ఆయన ఆరోపించారు.