Breaking News

ఇంద్రవెల్లి నెత్తుటిగాథకు 40 ఏళ్లు

ఇంద్రవెల్లి నెత్తుటిగాథకు 40 ఏళ్లు

సారథి, ఉట్నూర్(ఇంద్రవెల్లి): దోపిడీ, పీడనపై తిరుగుబాటు చేసిన అమాయక ఆదివాసీ అడవి బిడ్డలపై తుపాకీ తూటాల వర్షం కురిసింది. అడవి అంతా రుధిక క్షేత్రమైంది. అది ఎంతోమంది విప్లవ పాఠాలు నేర్పించింది. ఇంద్రవెల్లి నెత్తుటి గాథకు మంగళవారం నాటికి సరిగ్గా 40 ఏళ్లు అవుతుంది. 1981 ఏప్రిల్ 20.. ఆ రోజు ఏం జరిగిందంటే.. తాము సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, తమ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్లతో రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లి సభకు పిలుపునిచ్చింది. మొదట సభను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. గిరిజనుల నుంచి వస్తున్న స్పందన, చైతన్యాన్ని చూసి సభపై పోలీసులు నిషేధం విధించారు.

ఈ విషయం తెలియని అడవి బిడ్డలు.. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుని ప్రవాహంలా ఇంద్రవెల్లి తొవ్వ తొక్కారు. అడ్డుకునేందుకు పోలీస్ బలగాలు అడవుల్లోకి దిగాయి. వేలాదిగా వస్తున్న నిరాయుధులైన గిరిజనులపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు. అంతే పచ్చటి అడవి నెత్తురు చిమ్మింది. పారిన నెత్తురుకు, పగిలిన తలలకు లెక్కేలేదు. చెట్టుకొకరు.. పుట్టకొకరుగా అడవి బిడ్డలు పారిపోయారు. దేశవ్యాప్తంగా అప్పట్లో సంచనలం సృష్టించిన ఇంద్రవెల్లి కాల్పుల ఘటనలో 13 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వ అధికారులు తేల్చారు.

పీయూడీఆర్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ 60 మంది చనిపోయినట్లు గుర్తించింది. వందలాది మందికి గాయాలయ్యాయి. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్థూపం నిర్మించారు. 1986 మార్చి 19న గుర్తుతెలియని వ్యక్తులు పేల్చివేశారు. ప్రజాసంఘాల ఒత్తిళ్లు, గిరిజనుల పోరాట ఫలితంగా 1987లో ఐటీడీఏ నిధులతో తిరిగి స్థూపాన్ని కట్టారు. ఏటా ఆదివాసీ గిరిపుత్రులు అమరవీరులను యాదిచేసుకుంటున్నారు. ఇంద్రవెల్లి గతం కాదు. అదొక నెత్తటి జ్ఞాపకంగా మిగిలిందని చెబుతుంటారు.