Breaking News

4 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నా..

లక్నో: లాక్​ డౌన్​ సడలింపుల్లో భాగంగా మైదానాలు ఓపెన్​ కావడంతో టీమిండియా ప్లేయర్లు ఒక్కొక్కరిగా శిక్షణ మొదలుపెడుతున్నారు. తాను చిన్ననాటి నుంచి శిక్షణ పొందిన లాల్​బంగ్లా ప్రాంతంలోని రోవర్స్ మైదానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రతి రోజు నాలుగు గంటలు శిక్షణలో గడుపుతున్నానని చెప్పాడు. అయితే బంతిపై ఉమ్మి రుద్దకుండా ఉండేందుకు చాలా శ్రమించాల్సి వస్తుందన్నాడు.

‘నేను రోజు రెండు సెషన్లు శారీరక కసరత్తులు చేస్తున్నా. వారం రోజుల నుంచి ఇది కొనసాగుతుంది. శిక్షణ పూర్తికాగానే ఇంటికెళ్లి భౌతిక దూరం పాటిస్తున్నా. పోటీ క్రికెట్ ఆరంభమైతే వారం రోజుల్లో ఫిట్​నెస్​ సంతరించుకుంటా. క్రమం తప్పకుండా నెట్స్​లో బౌలింగ్ కూడా చేస్తున్నా. నా ప్రాక్టీస్​ను చిన్ననాటి కోచ్ కపిల్ పాండే పర్యవేక్షిస్తున్నాడు. అన్ని భాగానే ఉన్నా ఉమ్మి విషయంలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ అలవాటును మర్చిపోలేకపోతున్నా. కానీ తప్పదు మరవాల్సిందే’ అని కుల్దీప్ పేర్కొన్నాడు.