Breaking News

30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్​రెడ్డి వివరించారు. గురువారం మెదక్​జిల్లా నర్సాపూర్​అటవీ ప్రాంతంలో సీఎం కేసీఆర్​మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం మంత్రి హరీశ్​​రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్​రెడ్డి, మెదక్​జిల్లా కలెక్టర్​ధర్మారెడ్డి కలిసి అటవీప్రాంతాన్ని పరిశీలించారు. నర్సాపూర్ అర్బన్​పార్కులో సీఎం ఆరు మొక్కలు నాటుతారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 182 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. అవి నేడు పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు.

మంత్రి హరీశ్​​రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ చేపట్టిన హరితహారం మహాయజ్ఞాన్నివిజయవంతం చేయాలని కోరారు. వారి వెంట డీఎఫ్​వో పద్మజారాణి, నర్సాపూర్​ఎమ్మెల్యే మదన్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​చంద్రాగౌడ్, నర్సాపూర్​మున్సిపల్​చైర్మన్​మురళీయాదవ్ తదితరులు ఉన్నారు.

సీఎం కార్యక్రమానికి ఎవరూ రావొద్దు
రాష్ట్ర ప్రభుత్వం గురువారం చేపట్టనున్న హరితహారం కార్యక్రమాన్ని కరోనా నేపథ్యంలో ప్రజలంతా వారి గ్రామాల్లోనే నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రి హరీశ్​రావు​కోరారు. నర్సాపూర్ ​అటవీ ప్రాంతంలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ​వస్తున్నారని, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎవరూ హాజరుకావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.