Breaking News

2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ కాలేదు

2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ కాలేదు

కొలంబో: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్​ అయిందన్న ఆరోపణలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు లేవని లంక క్రీడా మంత్రిత్వ శాఖ విచారణ బృందం స్పష్టంచేసింది. ఈ మేరకు విచారణను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 10 గంటల పాటు అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరను విచారించిన విచారణ బృందం.. అతని స్టేట్​మెంట్​ను రికార్డు చేసింది. కానీ ఎక్కడా అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో దర్యాపు ముందు సాగలేదు. అరవింద డిసిల్లా (అప్పటి చీఫ్ సెలెక్టర్)తో పాటు ఉపుల్ తరంగను కూడా నాలుగు గంటల పాటు ప్రశ్నించిన బృందం ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోయింది. అప్పటి ఫైనల్లో సెంచరీ చేసిన మహేల జయవర్దనేను కూడా విచారించాలని భావించినా.. చివరి నిమిషాల్లో వెనక్కి తగ్గింది.

సంగక్కర, తరంగ, డిసిల్వ ఇచ్చిన స్టేట్​మెంట్లను పరిశీలించిన తర్వాత అప్పటి క్రీడా మంత్రి మహిదానంద అల్తుగమాగే ఇచ్చిన 14 పాయింట్లను ధ్రువీకరించలేని విచారణ బృందం చేతులెత్తేసింది. ఫైనల్ మ్యాచ్​కు ఎంపిక చేసిన తుదిజట్టులో నాలుగు మార్పులపై మహిదానంద అనుమానాలు వ్యక్తం చేశాడు. ముఖ్యంగా జయసూర్యను తప్పించడంపై ఎక్కువగా అనుమాలున్నాయని చెప్పాడు. దీనిపై డిసిల్వాను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. 2009లో జట్టు నుంచి తప్పుకున్న జయసూర్య.. 2011 వరకు ఒక్క వన్డే కూడా ఆడకపోవడంతోనే టీమ్​లోకి తీసుకోలేకపోయామని డిసిల్వా వివరణ ఇచ్చాడు. ఫైనల్​ మ్యాచ్​కు సంబంధించి ముగ్గురు ఇచ్చిన వివరణ సహేతుకంగా ఉండడంతో విచారణను ఆపేస్తున్నామని విచారణాధికారి జగత్ ఫోన్సెక ప్రకటించారు.