Breaking News

హృదయాలను కొల్లగొట్టిన ‘ప్రేమఖైదీ’

ప్రేమ ఓ మధురమైన జ్ఞాపకమే కాదు.. అదొక ప్రణయ యుద్ధం. కానీ అది లేనిదే జీవితమే లేదు. ఒక జంట ఎప్పుడైతే ప్రేమలో పడుతుందో అప్పటి నుంచే వాళ్ల జీవితంలో యుద్ధం మొదలవుతుంది. యుగాలు గడుస్తున్నా ఆ యుద్ధం ఆగదు. దాని లోతు తెలియదు.‘కళ్లతో చూసి వచ్చేది కాదు ప్రేమ మనసులోంచి పుట్టేది. అందుకే మన్మథులు సైతం ప్రేమ విషయంలో గుడ్డివాళ్లు అయిపోతారు అన్నాడు సుప్రసిద్ధ కవి షేక్​ స్పియర్​. రంగు చూసి, రూపం చూసి ఏ ఇద్దరిలో ప్రేమ పుట్టదు. అవధులు లేనిదే ప్రేమ అంటారు అనుభవజ్ఞులు. ఇలా ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే చాలా ప్రేమకథలతో సినిమాలు తీశారు ఫిల్మ్​ మేకర్లు.. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. కానీ అన్ని ప్రేమ యుద్ధాలు సక్సెస్ కావు. కొన్నింటికి మాత్రమే శుభం కార్డు పడుతుంది. సరిగ్గా 30ఏళ్ల క్రితం జరిగిన ఓ లవ్​ స్టోరీని ‘ప్రేమఖైదీ’గా తెరపైకి ఎక్కింది. యువత హృదయాలను కొల్లగొట్టింది.
ఇదీ నేపథ్యం..
నీలిమ చంద్రాన్ని ముందు ఆటపట్టించాలని అనుకుంది.. అది ఆట కాదు నిజమైన ప్రేమ అని తెలుసుకున్న మరుక్షణం అతనితో కలిసి జీవించాలి అనుకుంది. తన వల్ల జైలు పాలైన చంద్రానికి తోడుగా తాను కూడా ఖైదీగా మారింది. కాలం వాళ్లిద్దరినీ ‘ప్రేమఖైదీ’లుగా మారిస్తే ఆ జైలు ఆ జంటను మరింత దగ్గరయ్యేలా చేసింది. తర్వాత ఏమయింది అన్నదే కథ..
స్వర్గీయ డి.రామానాయుడు ప్రొడ్యూసర్ గా, స్వర్గీయ ఇ.వి.వి సత్యనారాయణ డైరెక్షన్​లో 1991లో రిలీజైన ‘ప్రేమఖైదీ’ సినిమా అప్పటివరకూ వచ్చిన ప్రేమ చిత్రాల రికార్డులను తిరగరాసి ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఆనాటి తరం ప్రేక్షకుల నుంచి ఈ తరం ప్రేక్షకులు కూడా ఆ సినిమాను చూసే ఉంటారు. అంతగా ప్రేమికుల గుండెల్లో నిండిపోయిందా చిత్రం. ఈ చిత్రానికి 1989లోనే శ్రీకారం చుట్టాడు ఈవివి సత్యనారాయణ. ఆయన మొదటి సినిమా రాజేంద్ర ప్రసాద్ హీరోగా తీసిన ‘చెవిలో పువ్వు’ అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. తర్వాత ప్రేమఖైదీ స్క్రిప్టును పక్కాగా రాసుకుని భయపడుతూనే ప్రొడ్యూసర్ రామానాయుడు కు కథ వినిపించారు ఇ.వి.వి.. కథ విన్న తర్వాత క్షణం కూడా ఆలోచించలేదట నాయుడు గారు. ఇ.వి.వి. మొదటి సినిమా సక్సెస్ కాకపోయినా అతని టాలెంట్ నచ్చి ఓకే చేప్పేశారట. వెంటనే ఇ.వి.వి. ఆర్టిస్టు​ల వేట ప్రారంభించి చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్​ను స్టార్ చేసిన హరీష్, మాలాశ్రీని హీరో హీరోయిన్లగా ఎంపికచేసి కథ పరంగా జైలర్ క్యారెక్టర్ కోసం ప్రముఖ నటి ఊర్వశి శారదను ఎంపిక చేసి ఆలస్యం చేయకుండా సినిమాను పట్టాలెక్కించేశారట.
ఇదీ కథ
ప్రముఖ వ్యాపారవేత్త బాపినీడు (గోకిన రామారావు) కూతురు నీలిమ(మాలాశ్రీ). అతని ఫ్యాక్టరీలో పనిచేసే సాధారణ కూలీ పీఎల్. నారాయణ. అతని కొడుకు చంద్రం (హరీష్). ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో నారాయణ రెండు కాళ్లూ విరిగిపోతాయి. డిగ్రీ పూర్తయిన చంద్రాన్ని తన ఇంట్లో అకౌంటెంట్​గా నియమిస్తాడు బాపినీడు. అమ్మాయిల వంక కన్నెత్తికూడా చూడని చంద్రంతో ఐ లవ్​ యూ చెప్పిస్తానని పందెం కడుతుంది నీలిమ తన ఫ్రెండ్స్​ తో. ఓడిపోయానన్న కసితో చంద్రం రేప్ చేయబోయాడని నింద మోపుతుంది. బాపినీడు చంద్రాన్ని తన మనుషులతో బాగా కొట్టించి ఇంటినుంచి గెంటివేయిస్తాడు. తప్పు తెలుసుకున్న నీలిమ ఈసారి చంద్రంతో నిజంగానే ప్రేమలో పడుతుంది. కానీ అప్పటికే చంద్రం నీలిమను ప్రేమిస్తున్నానని చెప్పడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పేదవాడైన చంద్రం ‘నీ ప్రేమను అందుకునే అర్హత నాకులేదు, ఒప్పుకునే సంస్కారం మీ నాన్నకు లేదు’ అని సిన్సియర్​గా నీలిమకు దూరమవ్వాలనే అనుకుంటాడు. కానీ నీలిమ నిజమైన ప్రేమకు లొంగిపోతాడు. వారి ప్రేమను చూసి రగిలిపోయి బాపినీడు చంద్రం తండ్రిని చంపించి ఆ నేరాన్ని చంద్రంపై మోపి జైలుకు పంపిస్తాడు. అక్కడ జైలర్​ గా వచ్చిన ప్రభావతి (శారద)చంద్రం కథను విని అతని ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రేమజంటకు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటుంది. మైనార్టీ తీరని తన కూతురుకు పెళ్లి చేసి ఫారిన్ పంపేయాలని ప్లాన్ చేస్తాడు బాపినీడు. అది తెలుసుకున్న నీలిమ ఇంట్లో నుంచి పారిపోయి ఖైదీ అవతారంలో చంద్రాన్ని చేరుకుంటుంది. ఆ తర్వాత ప్రభావతి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాళ్ల ప్రేమను గెలిపిస్తుంది. ఎక్కడా కాసింత కూడా బోర్ కొట్టని స్ర్కీన్​ ప్లే, డైలాగులు.. పాటలు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా ముఖ్యంగా ‘ఐ లవ్ ఫర్ యూ.. ఐ డై ఫర్ యూ’ అంటూ సాగే పాట ఆద్యంతం ఇప్పటికీ ప్రేమికుల పెదవులపై హమ్ అవుతూనే ఉంటుంది. టోటల్​గా చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా ఓ మ్యూజికల్ హిట్.. ప్రేమ కథలకు హిట్.. హీరో హీరోయిన్లకు టర్నింగ్ పాయింట్ అయ్యింది. డైరెక్టర్ ఇ.వి.విని స్టార్ డైరెక్టర్​ గా చేసింది.
బాలీవుడ్​లోనూ ప్రేమఖైదీ
రామానాయుడు మెగా ప్రొడ్యూసర్​గా మారి ఈ సినిమాను బాలీవుడ్​ లో హరీష్ హీరోగా, కరిష్మా కపూర్ హీరోయిన్​గా, అదే టైటిల్​తో సినిమా నిర్మించారు. ఇందులో పంతులుగా బ్రహ్మానందం ‘ఓం నమఃశ్శివాయా’ అంటూ ఇచ్చే స్పెషల్ ఎంట్రీ అదిరింది. అప్పుడే ఫామ్​లోకి వస్తున్న బ్రహ్మానందం కెరీర్​కు ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో అలీ, ఉత్తమ్​లు కూడా జైలు ఖైదీలుగా కీలకపాత్రలు పోషిస్తే విలన్ పోలీస్​గా జయప్రకాష్ మెప్పించాడు. రాజన్ నాగేంద్ర సంగీతాన్ని సమకూర్చారు. ‘ఖైదీ’ సినిమా మలుపుతో చిరంజీవి మెగస్టార్​గా ఎదిగితే.. ‘ప్రేమఖైదీ’ సినిమా ఈనాటికీ ప్రేమికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ప్రేమకథా చిత్రాల్లో నంబవర్​ వన్​ అయింది.

:: శ్రీ