మళ్లీ చిరంజీవి సినిమాలో విజయశాంతి
రాజకీయాల్లో పాల్గొనడం కారణంగా చాలాకాలంగా సినిమాలు చేయడం లేదు లెజెండరీ హీరోయిన్ విజయశాంతి. కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతోతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో విజయశాంతి తన ఇమేజ్ కి తగ్గ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి అందరినీ మెప్పించారు. సినిమా హిట్ తో కెరీర్ కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో ఆమె ఓ కీలకపాత్ర పోషించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. మోహన్ లాల్ మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్లో చిరంజీవి నటించబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకుడు.
ఒరిజినల్ వెర్షన్ లో మంజు వారియర్ పోషించిన పాత్రకు తెలుగులో విజయశాంతిని సంప్రదిస్తున్నారట. విజయశాంతి వయసుకు, ఇమేజ్ కి తగ్గ పాత్రే అది. కాకపోతే హీరోకి చెల్లెలి వరసయ్యే పాత్ర. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ అనగానే ‘గ్యాంగ్ లీడర్’ లాంటి ఇరవైకి పైగా సూపర్ హిట్ సినిమాలన్నీ గుర్తొస్తాయి. విజయశాంతి జంటగా నటించింది ఎక్కువ చిరూ చిత్రాల్లోనే. దాదాపు రెండు దశాబ్ధాలుగా వీరి మధ్య ఉన్న విభేదాలు తొలిగిపోయి ‘సరిలేరు నీకెవ్వరు’ వేడుకలో తిరిగి ఒక్కటయ్యారు. ఇదే వేదికపై చిరు సినిమాలో మళ్లీ నటించేందుకు తాను సిద్ధమే అన్నారు విజయశాంతి. దీంతో ‘లూసిఫర్’ రీమేక్ లో మళ్లీ కలిసి నటిస్తారనే వార్తలొస్తున్నాయి. కానీ సూపర్ హిట్ జోడిగా నటించిన వీరిద్దరినీ అన్నాచెల్లెలి పాత్రల్లో అభిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నదే సమస్య. పైగా ఎప్పటికీ చిరు నా హీరోనే, నేను ఆయన హీరోయిన్నే అని చెప్పిన విజయశాంతి ఇప్పుడు చెల్లెలి క్యారెక్టర్ కి అంగీకరిస్తారా. చిరంజీవి ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేస్తున్నారు. అలాగే వారి పాత్రల్లో కూడా ఏమైనా మార్పులు చేస్తారేమో. అలా జరిగి చిరంజీవి, విజయశాంతి మరోసారి జంటగా నటిస్తే ఇక అభిమానులకు పండుగే.