విభిన్న పాత్రలతో దూసుకెళ్తున్న విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ ద ఫస్ట్ కేస్ సినిమా బాలీవుడ్ రీమేక్ అవుతోంది. ఈ చిత్రాన్ని హీరో నేచురల్ స్టార్ నాని నిర్మించిన విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిచింది. దర్శకుడు, హీరో విశ్వక్ సేన్‌కు మంచిపేరు కూడా తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని త్వరలో హిందీలో రీమేక్ చేయబోతున్నారని కొన్నిరోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్‌లో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నారు. ఇదే విషయాన్ని మంగళవారం మీడియాకు వెల్లడించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ రీమేక్‌లో టాలెంటెడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు నటించనున్నారు.
‘హిట్ చిత్రాన్ని చూసినప్పుడే బాగా కనెక్ట్ అయిపోయాను. ఇదొక ఎంగేజింగ్ స్టోరీ.. ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిది. ఒక నటుడిగా ఇలాంటి పాత్ర కోసమే ఎదురుచూస్తున్నాన.. ‘హిట్’ తో ఆ అవకాశం లభించింది. ఈ సినిమా జర్నీని శైలేష్ కొలను, దిల్ రాజుతో ఎప్పుడు మొదలుపెట్టాలా అని ఎదురుచూస్తున్నాను..’ అని రాజ్ కుమార్ రావు తెలిపారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా శైలేష్ కొలను డైరెక్షన్ చేస్తూ బాలీవుడ్ కు కొత్త దర్శకుడిగా పరిచయం కానున్నారు.