Breaking News

స్వేచ్ఛగా.. హాయిగా

నల్లమల ఫారెస్ట్ సంచరిస్తున్న వన్యప్రాణులు

– కరోనా నేపథ్యంలో బోసిపోయిన నల్లమల రోడ్లు
– ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న అడవి జంతువులు

సారథి న్యూస్, నాగర్కర్నూల్: కరోనా ప్రతి ఒక్కరినీ ఇంటికే పరిమితం చేసింది. ఎక్కడ కాలు పెడితే మహమ్మారి అంటుకుంటుందోనని బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కిస్తున్నారు.. కానీ అటవీ జంతువులు మాత్రం స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. శ్రీశైలం పేరు చెబితే.. ఠక్కున గుర్తుకొచ్చేది వన్యప్రాణుల నెలవుగా నిలిచిన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అభయారణ్యం.. నల్లమలలోని రోడ్డు వెంట ప్రయాణిస్తే అక్కడి ప్రకృతి అందాలు, పచ్చదనం మనస్సుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా శ్రీశైలం మల్లన్న ఆలయ దర్శనాన్ని నిలిపివేసి.. భక్తులను నిలువరించడంతో నల్లమలలోని వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి.

సాధారణంగా అయితే ప్రతిరోజూ ఐదొందలకు పైగా శని, ఆదివారాల్లో రెండువేల వాహనాలకు పైగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్డుపై వాహనాల రద్దీ ఉంటుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను అటవీశాఖ అధికారులు పక్కాగా అమలుచేస్తున్నారు. ఒక్క వ్యక్తిని కూడా నల్లమల ఫారెస్ట్ లోపలికి అనుమతించడం లేదు. దీంతో నల్లమల శ్రీశైలం రోడ్లు బోసిపోయాయి.

ఎన్నో వన్యప్రాణులు
సువిశాలమైన నల్లమలలో 20 పెద్ద పులులు, 103 చిరుత పులులు,170 ఎలుగుబంట్లు, 5000 జింకలు కొన్ని వేలకుపైగా అడవి కుక్కలు, అడవి పందులు, కోతులు, దుప్పులు, నెమళ్లు, అడవి కోళ్లు ఇతర వివిధ జంతుజాతులు ఉన్నాయి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో వాటి తాగునీటి కోసం 750 నీటి సాసర్ లు ఏర్పాటుచేశారు. జనసంచారం వాహన లేకపోవడంతో శబ్ద, వాయుకాలుష్యం లేకుండా వన్యప్రాణులు స్వేచ్ఛగా అడవిలో తిరుగుతున్నాయి. వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ, జంతువులకు వైరస్ సోకకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు. మే నుంచి ఆగస్టు వరకు పులులు క్రాసింగ్ కు వచ్చే దశ కావడంతో ఆగస్టు నెల చివరి వరకు అడవిలో ఎవరికీ అనుమతి లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అడవిలోకి వచ్చినట్లయితే వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.. తాజాగా, శ్రీశైలం రోడ్లపై పులులు ఎలుగుబంట్లు సంచరిస్తున్న దృశ్యాలు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు కనిపించాయి. ఇక కోతులు, పాముల అడవిలో సంచారం చేస్తూ కెమెరాలతో పర్యవేక్షిస్తూ అటవీశాఖ సిబ్బంది అటవీ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వాహనాల సంచారం పూర్తిగా లేకపోవడంతోనే జంతువులు అడవుల నుంచి బయటకు వస్తున్నాయి, శబ్ద, వాయు కాలుష్యం లేకపోవడంతో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి అని జిల్లా అటవీ అధికారి తెలిపారు. అటవీశాఖ సిబ్బంది అనుక్షణం వన్యప్రాణుల కదలికలపై కన్నేశారని తెలిపారు.