- మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి
సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు, పంటమార్పిడి విధానంపై జిల్లా రైతులను చైతన్యం చేయాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అగ్రికల్చర్ ఆఫీసర్లతో సమీక్షించారు. ఏఈవోలు రైతుల ఇంటికి వెళ్లి వారికి మాట్లాడి పంటసేద్యంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఏయే ప్రాంతంలో ఏ పంట వేస్తున్నారనే వివరాలను ఏఈవోలు వద్ద ఉండాలన్నారు.
నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు నిర్వహించాలని సూచించారు. డిమాండ్ ఉన్న తెలంగాణ సోనారకం వరిని నాటుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయంగా బాస్మతి రైస్ ను కూడా సాగుచేయాలని సూచించారు. మెదక్ జిల్లా వారీగా అగ్రికల్చర్ కార్డును రూపొందించాలని, దాని ప్రకారమే పంటల సాగును చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురామ్ నాయక్ , జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు టి.సోములు, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.