Breaking News

సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం సస్యశ్యామలం

సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం సస్యశ్యామలం

సారథి న్యూస్, హైదరాబాద్: మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లోని ఇల్లందు, పాలేరు, వైరా, సత్తుపల్లి, పినపాక, ములుగు నియోజకవర్గాల్లోని భూములకు సాగునీరు అందించేందుకు వీలుగా సీతారామ ప్రాజెక్టును విస్తరించే పనులపై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టును ఒకేసారి పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్​ అన్నారని చెప్పారు.

గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న గార్ల, బయ్యారం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయని, ఈ మండలాలు సీతారామ ప్రాజెక్టు ద్వారా లబ్ధిపొందుతాయని వివరించారు. సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, రాష్ట్ర విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్య రాములు నాయక్, సీతారామ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.