న్యూఢిల్లీ: పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించలేదంటూ సొంతపార్టీ కాంగ్రెస్ పైనే తిరుగుబాటు చేసిన రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు నిరాకరించారంట. తనను ఏడాదిలోపు సీఎం చేయాలని ఆయన డిమాండ్ చేశారని, హామీ ఇచ్చే వరకు తాను భేటీ అయ్యేది లేదని తేల్చి చెప్పారని ప్రియాంకగాంధీకి సన్నిహితుల్లో ఒకరు చెప్పారు. తనను సీఎంను చేస్తానని పబ్లిక్‌గా అనౌన్స్ చేయాలని పైలెట్ కోరారని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన తర్వాత పైలెట్ ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారని అన్నారు. రెండురోజుల క్రితం ప్రియాంక గాంధీ పైలెట్‌తో మాట్లాడారని, ఆయన చాలా ఓపికగా మాట్లాడరని చెప్పారు. తనను డిస్‌క్వాలిఫై చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారని, వాళ్లను ఎలా నమ్ముతానని పైలెట్ అన్నట్లు తెలుస్తోంది.
2018లో రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే పార్టీ విజయానికి తాను ఎంతో కృషిచేశానని, సీఎం పదవి తనకు ఇవ్వాలని సచిన్ పైలెట్ డిమాండ్ చేశారు. కానీ అశోక్ గెహ్లాట్‌ను సీఎంను చేసిన హైకమాండ్ సచిన్ పైలెట్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది. కాగా, మొదటి నుంచి దీనిపై అసంతృప్తితో ఉన్న పైలెట్ ఇటీవల తిరుగుబాటు చేశారు. తన మద్దతుదారులతో తిరుగుబాటు చేసి సీఎల్పీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో పైలెట్, అతని వైపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ వేటువేసింది.