సారథి న్యూస్, రామగుండం: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్జీఎన్ జీఎం ఆఫీసు ఎదుట నిరాహారదీక్షలు చేపట్టారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వై గట్టయ్య, వి.సీతారామయ్యతో పాటు సీపీఐ నాయకులు జి గోవర్ధన్, కె.కనకరాజు దీక్షలను ప్రారంభించారు. సింగరేణి యాజమాన్యం కరోనా పేరుతో సమస్యలు పరిష్కరించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికులు తన రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తిని సాధించి లాభాలు తీసుకొస్తే యజమాన్యం లాభాలు ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఇవ్వడం సరికాదన్నారు.
వెంటనే లాభాలు ప్రకటించి 35 శాతం కార్మికులకు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లాక్ డౌన్ మార్చి నెలలో 50 శాతం జీతాల్లో కోత పెట్టిన వాటిని వెంటనే చెల్లించాలని, మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు 10 శాతం ఇంటి కిరాయి చెల్లించాలని, కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీక్షలో కార్మికసంఘం నాయకులు జి.రవీందర్, ఎం.మహేష్, రంగు శ్రీనివాస్, వెంకరెడ్డి, సంకె అశోక్, వెంకటరెడ్డి, మహేందర్ రావు, సతీష్ బాబు, రాజయ్య, దినేష్, పి.రమేష్ కుమార్ పాల్గొన్నారు.