సారథి న్యూస్, గోదావరిఖని: పట్టణంలోని సింగరేణి తరియా హాస్పిటల్ లో కరోనా కలవరం మొదలైంది. రెండు రోజుల క్రితం 8 ఇంక్లయిన్ కాలనీకి చెందిన సింగరేణికి చెందిన ఓ కార్మికుడు మృతిచెందిన విషయం తెలిసిందే, కాగా, బుధవారం గోదావరిఖనికి చెందిన మరో సూపర్వైజర్ స్థాయి ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ప్రచారం జరగడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కలవరం నెలకొంది.
రెండురోజుల క్రితం సింగరేణి ఆస్పత్రిలో సదరు బాధితుడు అందరితో కలిసి తిరిగాడని అతని కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రి వైద్యసిబ్బంది, ఉద్యోగులు భయాందోళనకు గురై బుధవారం ఆస్పత్రి ఉన్నతాధికారి ఎదుట నిరసన తెలిపారు. వైద్యసిబ్బందికి సరైన భద్రత చర్యలు కల్పించాలని, పీపీఈ కిట్టు ఇవ్వాలని, రూ.50లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. విధులకు హాజరైన ఉద్యోగులు అందరినీ క్వారంటైజన్కు పంపించాలని కోరారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.