Breaking News

‘విరాట‌ప‌ర్వం’లో కామ్రేడ్ భార‌త‌క్క

రానా ద‌గ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘విరాట‌ప‌ర్వం’ చిత్రంలో ఒక కీల‌కపాత్ర పోషిస్తోన్న ప్రియ‌మ‌ణి (జూన్ 4) గురువారం పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ‘విరాట‌ప‌ర్వం’లో ఆమె ఫ‌స్ట్‌లుక్ పోస్టర్​ను విడుదల చేశారు. ఆ పోస్టర్​లో బ్లాక్​ డ్రెస్​లో అడ‌వి అందాలను ఆస్వాదిస్తున్నట్లు స్వచ్ఛగా న‌వ్వుతూ క‌నిపిస్తున్నారు ప్రియ‌మ‌ణి. విప్లవ నాయ‌కురాలు కామ్రేడ్ భార‌త‌క్క పాత్రకు సంపూర్ణ న్యాయం చేస్తున్నట్లు ఆమె క‌నిపిస్తున్నారు.
‘మహాసంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో ‘విరాటపర్వం’లో కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకం’ అని ఆమె పాత్ర ప్రాముఖ్యం గురించి చిత్ర ద‌ర్శకుడు వేణు ఊడుగుల ట్వీట్ చేశారు.
వివాహానంత‌రం న‌టిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రియ‌మ‌ణి పాత్రల ఎంపిక‌లో సెల‌క్టివ్‌గా వ్యవహరిస్తూ, ప‌ర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్లు మాత్రమే చేస్తున్నారు. అదే త‌ర‌హాలో ‘విరాట‌ప‌ర్వం’లో తాను చేస్తున్న పాత్రను ప్రేమించ‌డం వ‌ల్లే దాన్ని చేయ‌డానికి ఒప్పుకున్నాన‌ని ఆమె చెప్పారు.
‘విరాట‌ప‌ర్వం’ అనేది కంటెంట్ మీద ఆధార‌ప‌డిన ఒక యూనిక్ ఫిల్మ్‌. ఇందులోని ప్రధాన పాత్రదారులంతా ఇదివ‌ర‌కు తామెన్నడూ చేయ‌ని పాత్రల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొద్దిపాటి షూటింగ్ మిన‌హా సినిమా అంతా పూర్తయింది.
తొలిచిత్రం ‘నీదీ నాదీ ఒకే క‌థ‌’తో టాలెంటెడ్​ ఉన్న దర్శకుడిగా అంద‌రి ప్రశంసలు పొందిన వేణు ఊడుగుల ‘విరాట‌ప‌ర్వం’ను తీర్చిదిద్దుతుండ‌గా, సురేష్ ప్రొడ‌క్షన్స్​, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వర సినిమాస్ అధినేత‌లు డి.సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందితాదాస్‌, న‌వీన్ చందర్​, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వర్​రావు, సాయిచంద్ కూడా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.