- వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
సారథి న్యూస్,నాగర్ కర్నూల్: అద్భుత తెలంగాణ ఆవిష్కరణకు నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నియంత్రిత సాగు విధానంపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దకాలం తర్వాత ప్రపంచ వ్యవసాయ చిత్రపటంలో తెలంగాణ ఉంటుందన్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో వేరుశనగ నుంచి మంచి వంగడాలు తీసుకొస్తామన్నారు. పంటను ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
రైతులు మొక్కజొన్న పండించవద్దని, వరిలో సన్నరకాలు పండించాలి సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలను 5 నుంచి 10 లక్షల ఎకరాల్లో పండించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లోనూ పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్యాయం జరగనివ్వబోమని, రైతుల కోసం నిలబడతామన్నారు. సమావేశంలో నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ప్రభుత్వ విప్ కె.దామోదర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కలెక్టర్ శ్రీధర్, మార్కెట్ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.