![వికాస్ దుబేతో పోలీసుల దోస్తీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/UP-2.jpg?fit=800%2C448&ssl=1)
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులపై కాల్పులు జరిపిన కేసుకు సంబంధించి పోలీసులు వికాస్ దుబే అనుచరుడు దయాశంకర్ అగ్నిహోత్రిని అరెస్టు చేసి విచారించారు. అతడిని విచారించిన పోలీసులకు కేసుకు సంబంధించి కీలక విషయాలు తెలిశాయి. వికాస్ దుబేను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని చౌబేపూర్ పోలీస్‌స్టేషన్ నుంచి ఒక పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అతను చెప్పాడు. దీంతో అప్రమత్తమైన దుబే తన అనుచరుల్లో దాదాపు 25మందికి సమాచారమిచ్చి కాల్పులకు పాల్పడేలా చేశారని అన్నారు. ఘటన జరిగిన టైంలో దుబే వద్ద 25 మంది ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి చౌబేపూర్ స్టేషన్ ఆఫీసర్‌ను దాదాపు 9గంటల పాటు విచారించిన పోలీసులు అతడిని సస్పెండ్ చేశారు.
దుబేపైన హత్యాయత్నం కేసు నమోదైన బీకూర్‌కు చౌబేపూర్ పోలీస్‌స్టేషన్ 14 కి.మీ. దూరంలో ఉంటుందని పోలీసు అధికారులు చెప్పారు. ఈ కేసులో అరెస్టయిన అగ్నిహోత్రి ఎఫ్ఐఆర్‌లో నమోదైన నిందితుల్లో ముఖ్యుడు. అగ్నిహోత్రిపై రూ.25వేలు రివార్డు కూడా ఉంది. కాగా.. శనివారం అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. అగ్రిహోత్రి పోలీసులపై కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో అగ్నిహోత్రి కుడి భుజానికి బుల్లెట్ గాయం అయినట్లు అధికారులు చెప్పారు. వికాస్ దుబే కోసం గాలిస్తున్నామని, ప్రస్తుతానికి అతని బ్యాంక్ ఖాతాలు, కార్లు, ఇల్లు సీజ్ చేశామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు. వికాస్‌దుబేపై ఉన్న రివార్డు కూడా పెంచామన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ బికారూకు చెందిన వికాస్ దుబే అనే క్రిమినల్‌ని అరెస్టు చేసేందుకు మూడు పోలీస్‌స్టేషన్లకు చెందిన పోలీసులు వెళ్లగా.. దుబే మనుషులు పోలీసులపై బుల్లెట్ల వర్షం కురిపించడంతో 8 మంది పోలీసులు చనిపోయారు.