- చేతికొచ్చిన పంట కీటకాల పాలు
- లబోదిబోమంటున్న మెదక్ జిల్లా రైతులు
‘ పదేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా ఈసారి అవేవో మిడతలు కొత్తగా వచ్చాయి. పంటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. అవి ఎలా పోతాయేమో.. వరి పంటపై కింది భాగాన, ఆకులపైన కొరికి వేస్తున్నాయి. దీంతో కష్టపడి సాగుచేసిన పంటంతా నేలపాలవుతోంది. పెట్టుబడి కూడా చేతికి రాదేమో..’ అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దంపడుతోంది.
సారథి న్యూస్, నర్సాపూర్: ఆరుగాలం శ్రమించి పండించిన పైరు మిడతల పాలవుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలను తినేస్తున్నాయి. కొన్నినెలల క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిడతల దండు నివారణ కోసం చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా, మెదక్ జిల్లాలో వరి పంటను మిడతలు ఆశించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలో వానాకాలంలో ఇప్పటి వరకు 1.6లక్షల ఎకరాల్లో వరి, 80 వేల ఎకరాల్లో పత్తి, 15వేల ఎకరాల్లో కంది పంటలు వేశారు. ఇదిలాఉండగా, కొల్చారంలో ఆదివారం సాయంత్రం సుమారు 10 ఎకరాల్లో వరి పంటపై మిడతల దండు వాలిపోయి పంటను నాశనం చేశాయి. మిడతలు వాలి వరి ఆకులు సగానికి తినడంతో పంటంతా నేలపాలవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
మేము మా తాతల కాలం నుంచి ఇలాంటి మిడత దండును ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే కొత్తగా చూస్తున్నం. పంటలపై వాలిపోయి మిడతలు పంటలను నాశనం చేస్తున్నయి. వీటివల్ల పంటలు పోయి మా బతుకులు ఆగమవుతుందేమో.. గర్నమెంటోళ్లు, వ్యవసాయశాఖ ఆఫీసర్లు ఈ మిడతల బారినుంచి మాకు పరిష్కారం చూపాలి.
:: జుర్రు సంతోష్, రైతు, కిష్టాపూర్
రైతులూ.. దిగులొద్దు
వేప నూనె పిచికారీ చేస్తే మిడతలను నివారించుకోవచ్చు. క్లోరోపైరీపాస్ మందును పిచికారీ చేస్తే చాలా వరకు మిడతల నుంచి ఉపశమనం కలుగుతుంది. జిల్లాలోని హవేలీ ఘనపూర్, వెల్దుర్తి మండలాల్లో కూడా మిడతల దండు వచ్చింది. లక్షల కొద్దీ ఇతర దేశాల నుంచి ఒకేసారి గుంపుగా వచ్చి వాలడం, కొన్నికొన్నిగా వచ్చి వాలడం వంటివి రెండు రకాలుగా ఉంటాయి. దీనికి గ్లాస్ సూపర్ వేప నూనె లాంటివి పిచికారీ చేయాలి. రైతులు ఎలాంటి దిగులు పడకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.
:: పరశురాంనాయక్, డీఏవో, మెదక్