సారథి న్యూస్, హైదరాబాద్: లాక్‌డౌన్ పొడిగింపుపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించామని.. మరింత కట్టుదిట్టంగా దాన్ని అమలు చేస్తామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్(సీపీ) అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆంక్షలు ఉన్నాయని, వాటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సీపీ మాట్లాడారు. నగరంలో 12వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారని, సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించే వారికి పీపీఈ కిట్లు అందజేశామన్నారు. అత్యవసరమైతే పాసులు ఇస్తున్నామని, దానికోసం వెబ్ పోర్టల్ ప్రారంభించామని అంజనీకుమార్ వివరించారు. పాస్‌ల కోసం ఎవరూ కమిషనర్ ఆఫీసుకు రావొద్దని.. ఆన్ లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్ని మతాలవారు తమ పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలన్నారు. అత్యవసర సేవల కోసం ఇచ్చిన పాసులను దుర్వినియోగం చేస్తే వాటిని రద్దు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 124 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని తెలిపారు.
- April 20, 2020
- Top News
- తెలంగాణ
- అంజనీకుమార్
- లాక్ డౌన్
- హైదరాబాద్ సీపీ
- Comments Off on లాక్ డౌన్ మరింత కట్టుదిట్టం