Breaking News

లద్దాఖ్‌లో మోడీ ఆకస్మిక పర్యటన

లద్దాఖ్‌: ప్రధాని నరేంద్ర మోడీ లద్దాఖ్‌లో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. గాల్వాన్‌ లోయలో భారత్‌- చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అనంతరం ఇక్కడ పరిస్థితిని ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ మీటింగ్‌లో ప్రధాని మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. జవాన్లు తమ ధైర్య సాహసాలతో ప్రపంచానికి ఇండియా బలం గురించి సందేశం పంపారని మెచ్చుకున్నారు. శత్రువులకు మీ ఆవేశం, ఆగ్రహాన్ని రుచి చూపించారని కితాబునిచ్చారు. ‘మీరు పనిచేస్తున్న చోటు కంటే మీ తెగువ అత్యంత ఎత్తులో ఉంది. 14 కార్ప్స్‌ ధైర్య సాహసాల గురించి ప్రతిచోట మాట్లాడుకుంటున్నారు. దేశంలోని ప్రతి ఇంట్లో మీ పోరాట పటిమ గురించి చెప్పుకుంటున్నారు. ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు శాంతిని నెలకొల్పలేరు. వీరత్వమే శాంతిని తిరిగి నెలకొల్పుతుంది. ప్రపంచం యుద్ధం కోరుకున్నా, శాంతిని కావాలనుకున్నా.. అలాంటి పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి ప్రపంచం మన ధైర్యసాహసాలు, గెలుపును చూసింది. మానవత్వం మెరుగుదలకు మనం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాం. మనం మురళిని ఊదే కృష్ణ భగవానుడ్ని కొలుస్తాం అదే టైమ్‌లో సుదర్శన చక్రంతో ఉండే కృష్ణుడినీ అనుసరిస్తాం’ అని మోడీ చెప్పారు. ప్రధాని అంతకుముందు ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. సరిహద్దులో తాజా పరిస్థితులను ఉన్నతాధికారులు ప్రధానికి వివరించారు. చైనా బలగాలతో ఘర్షణలో గాయపడ్డ జవాన్లను మిలటరీ ఆస్పత్రిలో ప్రధాని మోడీ పరామర్శించారు. మోడీతోపాటు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే ఉన్నారు.