టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్
న్యూఢిల్లీ: ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడమే.. ఐపీఎల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. బ్యాట్స్‌మెన్ స్థాయి నుంచి సారథిగా ఈ ముంబైకర్ ఎదిగిన తీరు చాలా అద్భుతంగా ఉందని కొనియాడాడు. ‘2008 రోహిత్ డెక్కన్ చార్జర్స్‌కు ఆడాడు. అప్పుడు అతనో కుర్రాడు. భారత్ తరఫున టీ20 ప్రపంచకప్ మాత్రమే ఆడాడు. అరంగేట్రం ఐపీఎల్ లో డీసీ ప్రదర్శన బాగాలేదు. అయినా రోహిత్ మాత్రం చాలా బాగా ఆడాడు. ఒత్తిడిలోనూ మిడిలార్డర్లోనూ పరుగులు చేసేవాడు. జట్టు అవసరాల మేరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేసేందుకు రోహిత్ సిద్ధంగా ఉంటాడు. అదే అతన్ని గొప్ప ప్లేయర్‌గా నిలబెట్టింది’ అని లక్ష్మణ్ వివరించాడు.
డీసీకి ఆడుతున్నప్పుడే రోహిత్ నాయకుడిగా ఎదిగాడన్నాడు. ‘ప్రతి మ్యాచ్‌కు రోహిత్లో ఆత్మవిశ్వాసం పెరిగేది. టీమ్‌లో కీలకసభ్యుడిగా మారిన తర్వాత కుర్రాళ్లకు అండగా నిలిచాడు. ప్రతి ఒక్కరికి చాలా సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. విషయమేదైనా తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేవాడు. ఓ నాయకుడిగా ఎదగడానికి ఇవన్నీ ముందస్తు లక్షణాలు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండడం రోహిత్లో చూశా. నా వరకైతే ఇది చాలా కీలకమని నమ్ముతా’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించాడు.