Breaking News

రోశయ్యకు కన్నీటి వీడ్కోలు

రోశయ్యకు కన్నీటి వీడ్కోలు
  • గాంధీభవన్​లో కాంగ్రెస్​నేత మల్లికార్జున ఖర్గే నివాళి
  • దేవరయాంజల్ లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు

సామాజికసారథి, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్ లోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో చివరి కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం రోశయ్య పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని స్వగృహం నుంచి గాంధీభవన్‌కు తరలించారు. కాంగ్రెస్ కురువృద్ధులు, రాష్ట్ర ఆర్థికానికి అద్భుతంగా దిశానిర్దేశం చేసిన మహామేధావి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య పార్థివదేహం గాంధీభవన్ కు చేరుకోగానే శోకతప్త నయనాలతో అభిమానులు ‘రోశయ్య అమర్​రహే’ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా వచ్చిన రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ ఇతర ముఖ్యనేతలు రోశయ్య భౌతికకాయం వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్ర కొనసాగింది. కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్​కార్యకర్తలు, నాయకులు, అభిమానులు చివరిసారి చూసేందుకు తరలివచ్చారు. అంతకుముందు రోశయ్య పార్థివ దేహానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సినీనటుడు చిరంజీవి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్​ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపలి, పేర్నినాని, బాలినేని శ్రీనివాస్ హాజరయ్యారు.