Breaking News

రైల్వేలు, మిలటరీపై పాక్‌ స్పైల మానిటరింగ్‌

  • విశ్వసనీయ వర్గాల సమాచారం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం పట్టుబడ్డ ఇద్దరు పాకిస్తానీ స్పైలలో ఒకరు ఇండియన్‌ రైల్వేస్‌, ఆర్మీ, ఎక్విప్‌మెంట్‌ గురించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్మీని తరలించే రైళ్ల గురించి అన్ని వివరాలు తెలిసిన వ్యక్తి ద్వారా వివరాలు రాబట్టాలని ప్రయత్నించాడని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని పాకిస్తాన్‌ హై కమిషన్‌ వీసా సెక్షన్‌లో పనిచేస్తున్న అబిద్‌ హుస్సేస్‌, తాహిర్‌‌ ఖాన్‌లను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వాళ్లిద్దరినీ పాకిస్తాన్‌ స్పైలుగా గుర్తించిన అధికారులు 24 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని చెప్పారు. వాళ్లిద్దరు పాకిస్తాన్‌ ఇంటర్‌‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ (ఐఎస్‌ఐ)కి పనిచేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. ఆ ఇద్దరు ఫేక్‌ ఐడెంటీ కార్డులతో మన దేశంలోని వివిధ శాఖల వారితో పరిచయాలు పెంచుకుని వివరాలు సేకరించేందుకు ప్రయత్నం చేశారు. అబిద్‌ హుస్సేన్‌ రైళ్ల గురించిన సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.

తన పేరు గౌతమ్‌ అని, ఒక ప్రముఖ జర్నలిస్ట్‌ సోదరుడిని అని పరిచయం చేసుకున్న అబిద్‌ ఒక స్టోరీ కోసం సెక్యూరిటీని తరలిస్తున్న రైళ్లు, ఎక్విప్‌మెంట్‌ను తరలిస్తున్న రైళ్ల వివరాలు చెప్పాలని అడిగాడని తెలుస్తోంది. దాని కోసం ఆఫీసర్‌‌కు డబ్బులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక వ్యక్తి చెప్పారు. పాకిస్తాన్‌ దౌత్య కార్యాలయంలో పనిచేసే ఇద్దరు సభ్యులు రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారని, దౌత్య కార్యాయంలోకి వారు భారతదేశానికి వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు మన విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.